27, మే 2012, ఆదివారం

చిన్న కథ.. మనసుకి చేరే మాట.....

మన మనసుకి తాకి మనలోని ఒక మార్పుకి, మన జీవితపు పరుగులకి ఒక అందం తెచ్చిన ఏ  చిన్న మాట/ఆలోచన  ఐనా మరొకరికి   పంచుకోడం మన బాద్యత.. ఎందుకంటే మనసుని తాకినా మాట పంచడం మొదలెడితే అది మరొక మదిని అందుకునే ప్రయత్నం తప్పక నెరవేరుతుంది ...

సమస్య ఎంత పెద్దది ఇతే అంత ఎక్కువ టెన్షన్ ఉంటుంది/ఉండాలి అనుకోడం పొరపాటు. సమస్యకి టెన్షన్ కి సంబంధం ఎలా ఉండాలంటే అంటూ ఒక డాక్టర్ (జూలూరి శ్రీనివాస్,అపోలో హాస్పిటల్) చెప్పిన కథ కాని కథ.....రేపు మంజీరాలో చుక్క నీరు ఉండదు అని తెలిసిందనుకోండి మీరు ఏమి చేస్తారు..మీ పంపులో నీరు రావడం లేదు అని తెలిసిందనుకోండి దానికి మీరు ఏమి చేస్తారు ..ఈ రెండిటిలో ఏది పెద్ద సమస్య, దేనికి మీరు టెన్షన్ పడొచ్చు అని అడిగారు..
రెండిటికి టెన్షన్ ఉంటుంది కదా అంటే....అందుకు ఆయన నవ్వి ఇలా చెప్పారు....
మీరు ఎంత టెన్షన్ పడినా మంజీరా లో నీటి సమస్యకి ఏమి చేయలేరు అందుకని అది మీకు ఒక వార్త లాంటిది మాత్రమె అందుకు మీరు టెన్షన్ పడకూడదు. మీ ఇంట్లో నీరు రావడం లేదన్నది చిన్న సమస్య ఐనా ..టెన్షన్ పడొచ్చు, ఎక్కడ పంపుకి అడ్డు పడిందో ఏమయ్యిందో అని ఎందుకంటే అది మీరు సరి చేసుకోవాల్సిన సమస్య అని..మనకు తెలియాల్సింది దేనికి టెన్షన్ పడొచ్చు , దేనికి పడకూడదు అని..చాలా మంది అనవసరమైన వాటికి అతి ఎక్కువ టెన్షన్ పడి అందర్ని ఇబ్బంది పెడతారు అని చెప్పారు.

ఒక చిన్న మాట , ఒక చిన్న సంఘటన జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తాయి ఒకోసారి...మనకు ఉన్నదానిలో నుండి పెట్టడం అన్నది  ఎంత ముఖ్యమో ఒక ముసలావిడ మాటల్లో తెలిసింది..... కూరగాయలు ఇంటింటికి తిరిగి అమ్మేది ....ఈ వయసులో ఇంత  కష్టపడుతున్నావు నిన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరా అని అడిగితే... ఇంకో సంవత్సరం ఆగితే ఇంటి దగ్గరే చిన్న కొట్టు పెట్టుకుంటా...అప్పటి వరకు ఇలా వస్తూ ఉంటాను అంది.... ఆవిడకు ఇద్దరు కొడుకులున్నారు... పెద్దవాడిని పది వరకు చదివించింది...నీవు దాచిన డబ్బులు ఇయ్యి వ్యాపారం చేస్తా అన్నాడట....నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అందుకోసం సంపాదించుకో అని చెప్పిందట...కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట...ఎక్కడో కంట్రాక్టర్ దగ్గర చేరాడు అక్కడే పెళ్లి చేసుకొని సంసారం ఏర్పరచుకున్నాడు....రెండో వాడు పది అయ్యాక  పై చదువులు చదువుతాను అన్నాడట....మాస్టారి ఇంట్లో ఉండు వాళ్ళ పిల్లలతో పాటు చదివిస్తాడు....వాళ్ళకి సాయంగా ఉండు అని చెప్పిందట.....నువ్వు ఎంత వరకు చదివిస్తావో చదివించు తరవాత నేను చూసుకుంటా అన్నాడట....ఇంత కంటే చేయలేను అని చెప్పిందట......ఎక్కడో హాస్టల్ లో పెద్ద చదువే చదువుతున్నాడట.. అపుడపుడు వస్తాడట  ఏమైనా ఖర్చులకు ఇమ్మని...ఉంటే వంద  లేదా రెండువందలో ఇస్తుందట ...... ఇపుడు తన దగ్గర 8 తరగతి చదివే పిల్లాడు ఉన్నాడట  వాడికి అమ్మా నాన్న లేరని తనే చదివిస్తుందట.....పది చదివాక వాడు ఏదైనా చేసుకుంటాడు అంది.....మరి నీకు తోడూ ఎవరూ వద్దా.. అని అడిగితే....చదివిస్తే పిల్లలకు కొదవా అని నవ్వింది.....

ఒక డాక్టర్ చెప్పిన మాటలు ఎంత నచ్చాయో.. ఒక సామాన్య స్త్రీ మాటలు అంతే  నచ్చాయి...నిజంగానే ఈ మాటలు మరవకుంటే జీవితం పరుగులో నిండుదనం చేకూరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు...

1, మే 2012, మంగళవారం

కొత్త నేస్తం...

 ఇల్లు చూడగానే నచ్చలేదు...నేను ఇక్కడే ఉండాలి అనుకున్నాక మళ్ళీ మళ్ళీ ఆ ఇంటిని చూసా ..పాపం తన తప్పేం లేదు ఆ ఇంటి వాళ్ళ జ్ఞాపకాలతో వాళ్ళ ఆలోచనలతో అలసిపోయి ఉన్నట్టు అనిపించాక..అరచేయి చాచి స్నేహ హస్తం అందుకున్న ...ఇపుడు పాత జ్ఞాపకాలు అనుభవాలు అన్ని మరచి నాకై ముస్తాబైంది..

నేను తనకోసం ఎలా ఉండాలో .. దానికోసం ఏమి చేయాలో ఆలోచిస్తుంటే మనసంతా అలజడి..అందరూ అంటారు నువ్వు పాతవన్నీవదిలించుకుంటావు నీకు వస్తువులపైన ఏమి మమకారం ఉండదా అని.. ఏంటో వాళ్ళ ఆలోచన తప్పు అని అనలేను అలా అని అందరు చెప్పినట్టు నేను అన్ని దాచలేను....ప్రతీ దాని వెనుక ఎన్నో కలలుంటాయి ఎన్నో ఉహలుంటాయి, కొన్నిటి వెనుక కలతలుంటాయి అవి అన్ని నా జ్ఞాపకాలకి ఆనవాలు

నేను పాత చోటే నా జ్ఞాపకాల ఒడిలో ఉన్న ఎన్నోఆనవాలన్ని చేరిపెసా....వాటి తాలూకు ప్రతీ జ్ఞాపకాన్ని మనసు అడుగున సమాధి చేశా..కలతలని కన్నీళ్ళని నా వెంట రావొద్దని మొండితనంతో ఇనుప కంచే కట్టాను...నాకై తనని మార్చుకున్న ఇంటికోసం ... నేను మారలేక..నా కలతలతో తన అందం చెరిగిపోకుండా నాకై నేను కొన్ని అడ్డుగోడలు కట్టా...కొత్త నేస్తం కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా..ఇపుడు ఇద్దరం ఒకరికి ఒకరం....తన ఒడిలో నేను ...నా అరచేతి స్పర్శతో తను..

11, మార్చి 2012, ఆదివారం

పిచ్చి మనసు...

గుండె గొంతుతో కొట్లాడుతుంది....మాట అన్నది పలకనన్నది... ఊసులేవి చెప్పనన్నది, ఒంటరిగానే ఉంటానంటూ, తన వ్యధనేమో దాచిపెట్టి కంటి తడి బానిసను కానంటు మొండికేసి, మోకాళ్ళపై తలవంచి ఆలోచనలు కుప్పపోసి కోపంతో తగలెట్టి..విసురుగా సముద్రపుతీరం వైపు వడి వడిగా అడుగులేసి...అక్కడే కూర్చుండిపోయే..పిచ్చి మనసు ఓ చిన్ని మనసు.....మాటలేవీ వద్దే వద్దంటూ తెలిసిన అక్షరాలన్ని గులకరాళ్ళుగ చేసి సముద్రంలో విసిరేసింది..తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ పిచుకగూళ్ళు చేసి చెరిపేసింది....దాగని కన్నీళ్ళను నీటి చెలమలో కలిపేసింది....

అపుడు నీకు నేనున్నానంటూ భుజంపై చేయి వేసి ఒకరు, నీ ఇష్టం నాకు కాక ఎవరికీ తెలుస్తుంది అని తలపై చేయి వేసి ఒకరు,నీకు కావలసింది అందించే నేను ఉన్నానుగా అంటూ ఒకరు...ఇందరు ఉన్నా పలకడానికి ఒక అక్షరం కూడా లేదు  ఇపుడు....వారంతా నా వాళ్ళేకామోసు అని చెరిగిన పిచుకగూళ్ళ వైపు చూసింది. పకపకా నవ్వింది....పగలపడి నవ్వింది...ప్రశాంతంగా ఆగి ఆగి నవ్వింది...  నా వ్యధ పంచకుండానే, నాకై ఎవరి సాయం కోరకుండానే, నా ఇష్టం తెలిసి నాకు అందించలేదేమని అడగకుండానే....నాకోసం ఇపుడు వచ్చావా అనకుండానే... నాకై నీ అరచేతిని అడ్డుపెట్టలేదేమని ఆర్దిచకుండానే హాయిగా నవ్వడం వచ్చేసింది.....నేను గెలిచేసానోచ్ అని గెంతులువేసింది ఉల్లాసంగా పిచ్చి మనసు..తర్కం  తెలియని చిన్నపిల్లలా...

1, మార్చి 2012, గురువారం

మనసున మనసై బ్రతుకున బ్రతుకై...

మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.
ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారి సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి మరియు జగ్గయ్య లు నటించారు. ఈ సన్నివేశం నాగార్జున సాగర్ నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.

ఈ పాట 50వసంతాలకి చేరువలో ఉంది. విచిత్రం ఏంటంటే పాట పాత పడే కొద్ది అందులోని భావం మాత్రం ఎంతో శక్తి మంతమవుతూ ఉంది. ఈ పాట విన్నాక ఇలాంటి మనిషి మనకు ఉంటే అంతకన్నా ఏమి కావాలి ఈ జీవితానికి అని అనుకోని వారు ఉండరు.అప్పటికే ఆస్థులు,అంతస్థులు,పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన వారు కూడా ఇలాంటి ఒక మనిషి కోసం అరాట  పడడం అతిశయోక్తి కాదు. నిజంగా అలా ఒక మనిషితో అన్ని పంచుకుంటూ జీవితం గడపడం సాద్యమా అనే కంటే అలాంటి మనిషి మనతో జీవిత మంతా ఉండే అవకాశం సాధ్యమా అని ఆలోచించాలి. అలాంటి బంధం ఏ ఇరువురి మధ్య ఐనా కావచ్చు ...మన బంధం సోదరి/సోదరుడు, అమ్మ/నాన్న,కూతురు/కొడుకు,స్నేహితులు వీరిలో ఎవరైనా కావొచ్చు మన మనసున మనసై....కాకపోతే గుర్తించడం కష్టం, గుర్తించినా జీవితమంతా నిలుపుకోవడం ఇంకా కష్టం ..నాకు తెలిసిన సత్యం ఇదే...నేను నమ్మిన  నిజం కూడా ఇదే...వీలైతే కాదు..వీలుచేసుకొని మీరు ఒకసారి ఈ పాట విని ...నిజమెంతో మీరే చెప్పండి...

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 1
ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 2
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

29, ఫిబ్రవరి 2012, బుధవారం

మనసు ఇచ్చే విరామం .......

ఆలోచనలు చేయలేని మనసు, ఆనందం వెతుక్కోవడం కోసం ప్రతీ క్షణం ఎదురుతెన్నులు చూసే మనసు...ఒక చిన్న మాటకే తుళ్ళింతలతో కృష్ణనదిలా పరుగులిడే మనసు....అందాల హరివిల్లుకు ధీటైన మనసు ఒక్కోసారి ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోతుంది....అపుడు ఎవరు మనల్ని పలకరించిన చెప్పే జవాబు ఒకటే మనసు బాగాలేదు ఈ పదం ఎపుడో ఒకప్పుడు అందరూ చెప్పేదే..

మనసుకు నచ్చని పని చేయడం తప్పని సరి అయినపుడు, మనసు ని బుజ్జగించడం మొదలెడతాం మన మెదడులోని ఆలోచనా శక్తితో, మనసు తనకు కావాల్సింది వదులుకోక తప్పదని తెలిసినపుడు తను కోల్పోయే ఆనందం భర్తీ ఎక్కడ ఎలా చేయాలి అని, తనని తాను కోల్పోకుండా ఉండడానికి ఇచ్చే చిన్న విరామమే....ఈ నిశ్శబ్దం

చిన్నపిల్లాడు తనవద్ద ఉన్నఎర్ర రంగు బంతి పోగొట్టుకొని వేరే రంగు బంతి తో  లేదా అమ్మ ఇచ్చే చాక్లెట్ తో భర్తీ చేసినపుడు మనసులోని నిశ్శబ్దం గుర్తించలేనంత తక్కువ నిడివి కలిగి ఉంటుంది , ఒక తల్లి తన పిల్లాడు తప్పు చేస్తే మన్నించి  అక్కున చేర్చుకోడానికి మధ్య మనసు యొక్క నిశ్శబ్దం నిడివి తక్కువ,  ..కానీ  అన్ని సమయాల్లో అది సాధ్యం కాదు . ఏది ఏమైనప్పటికి మనసులోని నిశ్శబ్దం నిడివి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఈ నిడివి పెరిగే కొద్ది మనం అందుకునే ఆనందం ఎంత ఎక్కువ ఉంటుందో తెలియదు కానీ మనతో ఉండే పరిసరాలలో మనుషుల్లో పెను మార్పు కలగడం మాత్రం ఖాయం.

కొన్ని ఆకారణ ద్వేష భావాల వల్ల నిశ్శబ్ద నిడివి ఊహించలేనంత ఎక్కువగా ఉంటుంది ,అపుడు   ఈ మనసులో నిశ్శబ్దం మనిషిని కృంగదీస్తుంది.ఆప్తులని దూరం చేస్తుంది. ఇలాంటివి మనిషి జీవితంలో ఎపుడో ఒకప్పుడు ఎదురై ఇబ్బంది పెట్టొచ్చు..కానీ ఇలాంటివి  జీవితం మొత్తంలో అతి తక్కువ భాగస్వామ్యం ఉంటుంది.

మార్పు తప్పనిసరి ఇనపుడు, పదే పదే జరగనివి తలచుకోకుండా వీలయినంత త్వరగా వాటినన్నిటిని ఒక జ్ఞాపకంగా మార్చుకో....గోదావరి నది లాంటి నిశ్శబ్దాన్ని జ్ఞాపకాల భరిణలో దాచి కృష్ణవేణి నదిలా తుళ్ళింతలతో  సాగిపో... అది నీవు జీవితానికి అందించి అపురూపమైన కానుక.....

11, జనవరి 2012, బుధవారం

అద్దాల భరిణె లోని జ్ఞాపకం....ఈ కాశ్మీర్ నీలం

మనతో పరిగెడుతున్న కాలం..కాలంతో పోటీ పడుతూ మనం....నేను ఆనందంగా ఉన్నాను కాదా నా కంట్లో తడి ఆరిపోయిందేమో అనుకునే క్షణం... సుదీర తీరం నుండి చిన్న వార్తా... చిన్న మాట అదేంటి పేరు కూడా మనసుకు తట్టడం లేదు కానీ ఎందుకు మదిలో ఆలోచనలేమీ నాకు అందడం లేదు..కంటినుండిధారగా కన్నీళ్లు తప్ప వేరే ఏమి కనిపించడం లేదు...ఐనా వెక్కి ఏడవడం లేదు...నేను పెనవేసుకున్న జ్ఞాపకాలు నాకు మాత్రమే పరిమితం అన్న విషయం క్షణకాలం కూడా మరపుకు రాకుండా ఎలా ఉంది...నిజంగా నాకు బాధగా ఉందో లేక నలుగురి మధ్య నా బాధ్యత మరవకుండా కన్నీళ్ళకు అడ్డుకట్ట వేస్తూ ఉన్నందుకు సంతోష పడుతున్నానో తెలియని సమయం ..ఆనందరేఖలకు తెరకట్టి ఆవేదన చీకటిలో అలసటగా వాలిపోవాలని..వీటి మధ్య మనుషులు కనుమరుగు కాగానే అలా రాలే కన్నీటి చుక్కలు చూసి మనసెరిగిన ప్రియ ప్రియబాంధవి ఇదేనేమో అని ఇన్నేళ్ళకు కన్నీరుపై ఒకింత ఇష్టం కలిగింది అనిపించింది.

నీలం మూడు సంవత్సరాల పరిచయం...ఎక్కడో కాశ్మీర్ లో పుట్టి పెరిగిన అమ్మాయి..తెలుగే తెలియని అమ్మాయి..ఇక్కడ ఒక చిన్న పరిచయం...తెలియకుండానే మనసుకు నచ్చిన అమ్మాయి. ఎన్ని ఆశలు.. ఎన్ని ఇష్టాలు..క్యాన్సర్ అని తెలిసిన క్షణం నాకు తగ్గిపోతుంది కదా...నాకు జుట్టు పొతే మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందేమో...అలా జరక్కుండా ఏమి ట్రీట్మెంట్ లేదా అని అడిగిన అమ్మాయి... తప్పని సరి అయ్యేవరకు ఇంట్లో ఎవరికీ తెలియ పర్చకుండానే treatment మొదలుపెడ్డింది ఏమి తెలియని ఈ హైదరాబాద్ లో 26 సంవత్సరాల నీలం.....ఒక సంవత్సరం పోరాడి గెలిచానోచ్ అంటూ....ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలతో వాళ్ళ ఊరు వెళ్ళింది..కొన్ని నెలలు తిరక్కుండానే కోరి చేసుకుంటాను అంటూ వరుడు ఎదురయ్యాడు...treetment చేసిన డాక్టర్ ఇపుడు వద్దు ఇంకో సంవత్సరం ఆగమన్నాడు. ఆశకి... ఆలోచనలకి స్నేహం కుదరలేదు....ఉహాలతో పెళ్లిచేసుకొని....ఇదిగో మా హనీమూన్ photoes అంటూ వచ్చింది...ఈ సారి బ్రెయిన్ కి cancer అన్నారు...treatment కుదరదు అన్నారు.. నిశ్శబ్దంగా 15 రోజులు సెలవుపెట్టి మళ్ళీ వస్తా నంటూ కాశ్మీర్ వెళ్ళింది...మొన్న శనివారంతో తనకి సెలవులతో పనేలేదంటూ సెలవు తీసుకుంది..ఇప్పుడు  ఎక్కడో భూదేవి వడిలో నిదురిస్తుంది..(ఇది నీలం మాట..చోటి చోటి చీజోంకో క్యూ పకడ్ కె రక్తే ...రిస్తోంకో పకడియే )..తన రూపు కనుమరుగు అయిపోతుంది కానీ నా తలపుల్లో ఎక్కడో దాగివుంటుంది...తన పేరు మనసు ఊహలో ఉండిపోతుంది....నా మాటల్లో ఒక కథగా మిగిలితుంది..నీలం ఇపుడు నా  అద్దాల భరిణెలోని జ్ఞాపకం.


2, జనవరి 2012, సోమవారం

మదిలోని అలలు..

ఎన్నో కథలు ఎపుడో చదువుతాము..కొన్ని నవ్విస్తాయి..కొన్ని కవ్విస్తాయి..మరికొన్ని మనల్ని ఏమారుస్తాయి..ఇంకొన్ని మనలనే మారుస్తాయి..అతికొన్ని మారమని మనలని శాసిస్తాయి..కానీ కొన్ని మనకు తెలియకుండానే కొన్ని కథలు మన జీవితమంతా మనతోనే పయనిస్తాయి అవి పది కావొచ్చు వంద కావొచ్చు అవి మనతో పయనిస్తున్నాయి అని మనము కూడా గుర్తించలేనంతగా మనసులో స్థానం సంపాదించుకుంటాయి..ఒకరిని చూసినపుడు ఇతను/ఈమె బాగా తెలుసు అని అనిపించడానికి మీ మదిలోని కథలోని పాత్రనే కారణం అని గుర్తించడం ఒకింత కష్టమే.. మనసుని తాకినా కథలు ఎన్నో...అందులో అతికొన్నిమదిలోని అలలు..సంక్షిప్తంగా ఇక్కడ ఇలా ....

1.ఉదయిస్తున్న సూరిడిని చూస్తే భయం.. వడలిన ఆ ముదుసలికి , మళ్లీ 'రేపు' అనేది వస్తే, బ్రతకటానికి నూకలు ఎలా అని, అందుకే రేపటికోసం ఆకలిని వాయిదా వేసింది ఈరోజు, అప్పటికి ఆ వాయిదా వేయడం మొదలై 4 రోజులయ్యింది, ఆఖరుకు ఆకలి విజయం సాధించిది, అందుకే చారెడు నూకల గంజి కోసం అడుగు ముందు కేసింది..రేపటి సూరీడు  తలపు కొచ్చి తూలీపడి మరి లేవనే లేదు... ఇది ఎక్కడో నేను చదివిన కవితలోని భావం..

2. అబ్బా ఇంట్లో వాక్యూం క్లీనర్లు వచ్చాకా నాకు బ్రతుకు కష్టమైపోయింది అని వాపోయిందట ఓ ఎలుక  తన సహచరితో, నేను ఉండే వీధిలోని చెత్త కుప్ప దగ్గరకు వచ్చెయ్..జీవితాంతం ఇబ్బందే ఉండదు అందట.. అదెలా సాధ్యం అంటూ ఆశ్చర్య పోయిదట ఎలుక ..ఇంట్లో మొదలైన అభివృద్ధి వీధిలోకి రాదులెమ్మని నవ్వింది ఆ ఎలుకగారి సహచరి..

3.ఒక కుటుంబం లో చిన్నపిల్లవాడైన కొడుక్కి ప్రాణాపాయం. డబ్బుల్లేవు.... తండ్రికి ఉన్న ఒకే ఒక దారి ఎప్పట్నుంచో అప్పు ఉన్న ఓ కుటుంబం వారిని కలిసి డబ్బు వసూలు చేయడం. సరే, వాళ్ళింటికి వెళితే అక్కడ ఆ ఇంట్లో ఒకరు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.…ఆ విషంయం తెలిసినా తన డబ్బులు తీసుకొనే వెళ్ళాలి అన్న ఆత్రుతతో తన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తాడు ...డబ్బులు ఇవ్వకపోతే కదిలే ప్రశక్తే లేనట్టు ఆ ఇంటి గుమ్మం వదలడు...అలాంటి సమయంలోనే రోగంతో ఉన్న  ఆ ఇంటి మనిషి చనిపోతాడు ... దానితో ఇతన్ని మనుషుల రక్తం పీల్చే పిశాచం అన్నంత హీనంగా చూస్తారు. ఇతను అందరితో మాటలు పడి..ఛీ కొట్టించుకొని కొంత డబ్బులు తీసుకొని  ఇల్లు చేరేసరికి కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

4.ఒక ఊరిలో ఒక కవి ఉన్నారట, అతనికి భార్యా ఇద్దరు పిల్లలు కూడా,ఆతను రచయితగా నిలదొక్కుకోలేక పోయాడు, భార్య ఎపుడూ అనేది ఎందుకండీ! ఇక్కడ ఉండడం మనసు ఏదో కాస్త  పొలం ఉంది చిన్న ఇల్లు ఉంది ఊరిలో అక్కడే ఉంటే మనకు గడిచిపోతుంది, ఈ వ్రాయడం ఆపేసి వ్యవసాయం చేసుకుందాం అని అనేది...ఆతను మాత్రం నాకు వ్రాయడం  వచ్చు నేను ఇలా తప్ప వేరేల బ్రతకలేను అనేవాడు. ఎంత ప్రయత్నించిన అతనికి తగిన గుర్తింపు రాలేదు...పూట గడవడం కష్టంగా మార సాగింది...చేసేదేమీ లేకా సరే నీవు చెప్పినాట్టే ఊరికి వెళ్ళి పోదాం అన్నాడు...భార్య పిల్లలు అంతా బండిలో ప్రయాణం అయ్యారు...ఆతను బండి ఎక్కేముందు తన కలం, పుస్తాకాలు వదిలేసాడు అక్కడే, నేను చేయాల్సిన పని చేయలేనపుడు ఇవి మాత్రం ఎందుకు అని, సరే నిశ్సబ్దంగా బండి ఎక్కాడు...బండి ఊరి పొలిమేర వచ్చింది ..ఇంకా ఈ ఊర్లో నేను రైతునే కదా అన్నాడు...ఇంకొంచెం సేపటికి ఇల్లు వచ్చింది.. అందరు దిగారు...ఆతను మాత్రం అలానే వాలి పోయాడు...
కవిగా మరణించాడు...రైతుగా మారకముందే....ఆతను మనసా వాచా నమ్మాడు తను కవిని మాత్రమే నని....అందుకే నేమో అతని తనువు మనసు ఆత్మ అన్ని కలసికట్టుగా ఉన్నాయ్...



5. ఎపుడో 20 సంవత్సరాల  కింద చదివిన కథ, నాకు కథ పేరు కానీ వ్రాసిన వారు కానీ గుర్తులేదు. మనసులోని మాట చెప్పకపోతే జరిగింది ఈ కథలో చదివాక మనసుని మాట్లాడనివ్వాలి అని అనుకున్నాను. ఈ కథ ఒకరికి చెపితే (ఎప్పుడో లెండి) ఏమన్నారో తెలుసా  దీనివల్ల నాకు తెలిసింది ఒక్కటే పిల్లలని బయటకు విసిరేసి భార్యచుట్టు తిరగాలి అని... నిజంగా ఆ జవాబు నేను ఉహించలేదు. కథలో తప్పుందా నేను చెప్పడంలో తప్పుందా అనుకున్న మళ్లీ ఈ కథ ఎవరికీ చెప్పాకూడదనుకున్న అయినా అలవాటు మానుకోలేక మరోసారి ఇంకొకరికి చెప్పా, కథ విని మనసు చదవడం అందరికి రాదండి మాటల్లో చెప్పాలి అది ఎపుడు అనుకున్నది అపుడే అన్నాడు... అంతే మళ్లీ ఇదిగో కథ మంచిదే ఎవరి ఆలోచనని బట్టి వాళ్ళు అర్ధం చేసుకుంటారు అని నమ్మి నేను వ్రాసిన కథ   మనసు మాట్లాడాలి  .....