11, మార్చి 2012, ఆదివారం

పిచ్చి మనసు...

గుండె గొంతుతో కొట్లాడుతుంది....మాట అన్నది పలకనన్నది... ఊసులేవి చెప్పనన్నది, ఒంటరిగానే ఉంటానంటూ, తన వ్యధనేమో దాచిపెట్టి కంటి తడి బానిసను కానంటు మొండికేసి, మోకాళ్ళపై తలవంచి ఆలోచనలు కుప్పపోసి కోపంతో తగలెట్టి..విసురుగా సముద్రపుతీరం వైపు వడి వడిగా అడుగులేసి...అక్కడే కూర్చుండిపోయే..పిచ్చి మనసు ఓ చిన్ని మనసు.....మాటలేవీ వద్దే వద్దంటూ తెలిసిన అక్షరాలన్ని గులకరాళ్ళుగ చేసి సముద్రంలో విసిరేసింది..తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ పిచుకగూళ్ళు చేసి చెరిపేసింది....దాగని కన్నీళ్ళను నీటి చెలమలో కలిపేసింది....

అపుడు నీకు నేనున్నానంటూ భుజంపై చేయి వేసి ఒకరు, నీ ఇష్టం నాకు కాక ఎవరికీ తెలుస్తుంది అని తలపై చేయి వేసి ఒకరు,నీకు కావలసింది అందించే నేను ఉన్నానుగా అంటూ ఒకరు...ఇందరు ఉన్నా పలకడానికి ఒక అక్షరం కూడా లేదు  ఇపుడు....వారంతా నా వాళ్ళేకామోసు అని చెరిగిన పిచుకగూళ్ళ వైపు చూసింది. పకపకా నవ్వింది....పగలపడి నవ్వింది...ప్రశాంతంగా ఆగి ఆగి నవ్వింది...  నా వ్యధ పంచకుండానే, నాకై ఎవరి సాయం కోరకుండానే, నా ఇష్టం తెలిసి నాకు అందించలేదేమని అడగకుండానే....నాకోసం ఇపుడు వచ్చావా అనకుండానే... నాకై నీ అరచేతిని అడ్డుపెట్టలేదేమని ఆర్దిచకుండానే హాయిగా నవ్వడం వచ్చేసింది.....నేను గెలిచేసానోచ్ అని గెంతులువేసింది ఉల్లాసంగా పిచ్చి మనసు..తర్కం  తెలియని చిన్నపిల్లలా...

1, మార్చి 2012, గురువారం

మనసున మనసై బ్రతుకున బ్రతుకై...

మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.
ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారి సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి మరియు జగ్గయ్య లు నటించారు. ఈ సన్నివేశం నాగార్జున సాగర్ నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.

ఈ పాట 50వసంతాలకి చేరువలో ఉంది. విచిత్రం ఏంటంటే పాట పాత పడే కొద్ది అందులోని భావం మాత్రం ఎంతో శక్తి మంతమవుతూ ఉంది. ఈ పాట విన్నాక ఇలాంటి మనిషి మనకు ఉంటే అంతకన్నా ఏమి కావాలి ఈ జీవితానికి అని అనుకోని వారు ఉండరు.అప్పటికే ఆస్థులు,అంతస్థులు,పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన వారు కూడా ఇలాంటి ఒక మనిషి కోసం అరాట  పడడం అతిశయోక్తి కాదు. నిజంగా అలా ఒక మనిషితో అన్ని పంచుకుంటూ జీవితం గడపడం సాద్యమా అనే కంటే అలాంటి మనిషి మనతో జీవిత మంతా ఉండే అవకాశం సాధ్యమా అని ఆలోచించాలి. అలాంటి బంధం ఏ ఇరువురి మధ్య ఐనా కావచ్చు ...మన బంధం సోదరి/సోదరుడు, అమ్మ/నాన్న,కూతురు/కొడుకు,స్నేహితులు వీరిలో ఎవరైనా కావొచ్చు మన మనసున మనసై....కాకపోతే గుర్తించడం కష్టం, గుర్తించినా జీవితమంతా నిలుపుకోవడం ఇంకా కష్టం ..నాకు తెలిసిన సత్యం ఇదే...నేను నమ్మిన  నిజం కూడా ఇదే...వీలైతే కాదు..వీలుచేసుకొని మీరు ఒకసారి ఈ పాట విని ...నిజమెంతో మీరే చెప్పండి...

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 1
ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 2
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము