18, డిసెంబర్ 2012, మంగళవారం

నెమలీక

ఒకరు అడిగారని ప్రేమించరు....ఎవరో కోరారని ప్రేమించరు....ఒక్కోసారి ప్రేమించామని జీవితమంతా మనకే తెలియదు...ప్రేమించిన మనిషి మన కంటికెదురుగా ఉన్నంత  వరకు... ప్రేమ అనే పదం పలకడం సులువు...ఆస్వాదించడం నిరంతర  కృషి....మనసు స్వచ్చతకు ఒక ఆనవాలు...ఎవరు నిందించినా....ఎవరు నిరాకరించినా...ఎవరు బంధించినా.... చిట్టడవిలో కనుమరుగున ఉన్న గంధం చెట్టు సువాసనలా అందరిని అల్లుకుంటూనే  ఉంటుంది...ప్రేమ గెలిచినా..ఓడినా...పోరాడుతూనే ఉంటుంది తన మనుగడకోసం నిరంతరం...ఒకరి భాష్యానికి..ఒకరి భావానికి కట్టుబడిపోదు....అందుకే ప్రతీ ఒక్కరికి ఇంతటి  ఆరాధన ప్రేమంటే...నీకు లాగనే ....

జీవితం ఆకట్టుకోక పోయినా... ప్రేమ మాత్రం  అందరిని ఆకట్టుకుంటుంది .... ప్రేమించని మనిషి ఉండదు...కాకపొతే దేన్నీ ప్రేమించాడో తెలుసుకోలేకపోవచ్చు... కాని ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా...జీవితం పై పెద్దగా ఆశలు లేవు అంటూనే.. జీవితం అంటే నే విసుగు పుట్టిందని చాటింపు వేస్తూనే... ఈ జీవితమే వద్దంటూ తృణీకరిస్తూనే... ఎవరిపై చెప్పని చాడీలు చెపుతూనే...."నిజంగా నీకు నేను వద్దా అని జీవితం మన ఎదుట నిలబడి  ప్రశ్నించినపుడు...." అపుడు ఆలోచనలో పడతాడు... తనకు జీవితంపై ఎంతటి అనురాగమో... జీవితానికి ప్రేమించడమే తెలుసు...తనకు తెలిసింది మనకు అందించడమే తెలుసు.... ఎందుకంటే అది నీలాంటిదే కాబట్టి...

అందుకే జీవితంపై నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు...అది ఏది ఇచ్చినా నా దోసిట ఒడిసి పడతాను...అది ఇచ్చేది నా దోసిట పిడికెడు ఇసుకే కావొచ్చు, గులాబి మొగ్గే కావొచ్చు...తుమ్మముళ్ళే కానీ..గులక రాయే కానీ..రంగులనెమలీకలా నామనసంతా  జ్ఞాపకాలై నిండిపోతాయేమో....ఇది నేను నమ్మే నిజం ...
  మిమ్మల్ని నమ్మమని అడగలేను .... నమ్మొద్దని శాసించ లేను.

ఎదో ఒకసమయం.. నేను ఏమి ఆలోచించడం లేదనుకుంటూనే ఉన్నపుడు.. నా మనసు ఉల్లాసంగా పడవ ప్రయాణానికి వెళ్తుంది...అందుకు సాక్ష్యం తనతో తెచ్చే ఇసుకరేణువులు.. దోసిట ఉన్న ఇసుకతో ఈ తడి ఇసుకని కలిపి పిచ్చుక గూడు చేస్తాను..... అలసిన మనసు వడలిన ఆకుతో వస్తే గులాబీ మొగ్గని తోడుగా చేసి జీవం పోస్తా...
చెమ్మగిల్లిన మనసు తడితో  తుమ్మ ముల్లునే గులాబి ముళ్ళుగా మారుస్తా......ఏదైనాచేయగలను...జీవిత మిచ్చిన ఇన్ని బహుమతులు ఒదిగి ఒదిగి నా దోసిలి నిండుగా ఉన్నపుడు.... జీవితమిచ్చిన బహుమతులకు నేను రంగుల కాగితంతో అలంకరిస్తున్న ....నెమలీక లాంటి నువ్వు ఎదురైతే అందిద్దామని....