2, జనవరి 2012, సోమవారం

మదిలోని అలలు..

ఎన్నో కథలు ఎపుడో చదువుతాము..కొన్ని నవ్విస్తాయి..కొన్ని కవ్విస్తాయి..మరికొన్ని మనల్ని ఏమారుస్తాయి..ఇంకొన్ని మనలనే మారుస్తాయి..అతికొన్ని మారమని మనలని శాసిస్తాయి..కానీ కొన్ని మనకు తెలియకుండానే కొన్ని కథలు మన జీవితమంతా మనతోనే పయనిస్తాయి అవి పది కావొచ్చు వంద కావొచ్చు అవి మనతో పయనిస్తున్నాయి అని మనము కూడా గుర్తించలేనంతగా మనసులో స్థానం సంపాదించుకుంటాయి..ఒకరిని చూసినపుడు ఇతను/ఈమె బాగా తెలుసు అని అనిపించడానికి మీ మదిలోని కథలోని పాత్రనే కారణం అని గుర్తించడం ఒకింత కష్టమే.. మనసుని తాకినా కథలు ఎన్నో...అందులో అతికొన్నిమదిలోని అలలు..సంక్షిప్తంగా ఇక్కడ ఇలా ....

1.ఉదయిస్తున్న సూరిడిని చూస్తే భయం.. వడలిన ఆ ముదుసలికి , మళ్లీ 'రేపు' అనేది వస్తే, బ్రతకటానికి నూకలు ఎలా అని, అందుకే రేపటికోసం ఆకలిని వాయిదా వేసింది ఈరోజు, అప్పటికి ఆ వాయిదా వేయడం మొదలై 4 రోజులయ్యింది, ఆఖరుకు ఆకలి విజయం సాధించిది, అందుకే చారెడు నూకల గంజి కోసం అడుగు ముందు కేసింది..రేపటి సూరీడు  తలపు కొచ్చి తూలీపడి మరి లేవనే లేదు... ఇది ఎక్కడో నేను చదివిన కవితలోని భావం..

2. అబ్బా ఇంట్లో వాక్యూం క్లీనర్లు వచ్చాకా నాకు బ్రతుకు కష్టమైపోయింది అని వాపోయిందట ఓ ఎలుక  తన సహచరితో, నేను ఉండే వీధిలోని చెత్త కుప్ప దగ్గరకు వచ్చెయ్..జీవితాంతం ఇబ్బందే ఉండదు అందట.. అదెలా సాధ్యం అంటూ ఆశ్చర్య పోయిదట ఎలుక ..ఇంట్లో మొదలైన అభివృద్ధి వీధిలోకి రాదులెమ్మని నవ్వింది ఆ ఎలుకగారి సహచరి..

3.ఒక కుటుంబం లో చిన్నపిల్లవాడైన కొడుక్కి ప్రాణాపాయం. డబ్బుల్లేవు.... తండ్రికి ఉన్న ఒకే ఒక దారి ఎప్పట్నుంచో అప్పు ఉన్న ఓ కుటుంబం వారిని కలిసి డబ్బు వసూలు చేయడం. సరే, వాళ్ళింటికి వెళితే అక్కడ ఆ ఇంట్లో ఒకరు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.…ఆ విషంయం తెలిసినా తన డబ్బులు తీసుకొనే వెళ్ళాలి అన్న ఆత్రుతతో తన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తాడు ...డబ్బులు ఇవ్వకపోతే కదిలే ప్రశక్తే లేనట్టు ఆ ఇంటి గుమ్మం వదలడు...అలాంటి సమయంలోనే రోగంతో ఉన్న  ఆ ఇంటి మనిషి చనిపోతాడు ... దానితో ఇతన్ని మనుషుల రక్తం పీల్చే పిశాచం అన్నంత హీనంగా చూస్తారు. ఇతను అందరితో మాటలు పడి..ఛీ కొట్టించుకొని కొంత డబ్బులు తీసుకొని  ఇల్లు చేరేసరికి కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

4.ఒక ఊరిలో ఒక కవి ఉన్నారట, అతనికి భార్యా ఇద్దరు పిల్లలు కూడా,ఆతను రచయితగా నిలదొక్కుకోలేక పోయాడు, భార్య ఎపుడూ అనేది ఎందుకండీ! ఇక్కడ ఉండడం మనసు ఏదో కాస్త  పొలం ఉంది చిన్న ఇల్లు ఉంది ఊరిలో అక్కడే ఉంటే మనకు గడిచిపోతుంది, ఈ వ్రాయడం ఆపేసి వ్యవసాయం చేసుకుందాం అని అనేది...ఆతను మాత్రం నాకు వ్రాయడం  వచ్చు నేను ఇలా తప్ప వేరేల బ్రతకలేను అనేవాడు. ఎంత ప్రయత్నించిన అతనికి తగిన గుర్తింపు రాలేదు...పూట గడవడం కష్టంగా మార సాగింది...చేసేదేమీ లేకా సరే నీవు చెప్పినాట్టే ఊరికి వెళ్ళి పోదాం అన్నాడు...భార్య పిల్లలు అంతా బండిలో ప్రయాణం అయ్యారు...ఆతను బండి ఎక్కేముందు తన కలం, పుస్తాకాలు వదిలేసాడు అక్కడే, నేను చేయాల్సిన పని చేయలేనపుడు ఇవి మాత్రం ఎందుకు అని, సరే నిశ్సబ్దంగా బండి ఎక్కాడు...బండి ఊరి పొలిమేర వచ్చింది ..ఇంకా ఈ ఊర్లో నేను రైతునే కదా అన్నాడు...ఇంకొంచెం సేపటికి ఇల్లు వచ్చింది.. అందరు దిగారు...ఆతను మాత్రం అలానే వాలి పోయాడు...
కవిగా మరణించాడు...రైతుగా మారకముందే....ఆతను మనసా వాచా నమ్మాడు తను కవిని మాత్రమే నని....అందుకే నేమో అతని తనువు మనసు ఆత్మ అన్ని కలసికట్టుగా ఉన్నాయ్...



5. ఎపుడో 20 సంవత్సరాల  కింద చదివిన కథ, నాకు కథ పేరు కానీ వ్రాసిన వారు కానీ గుర్తులేదు. మనసులోని మాట చెప్పకపోతే జరిగింది ఈ కథలో చదివాక మనసుని మాట్లాడనివ్వాలి అని అనుకున్నాను. ఈ కథ ఒకరికి చెపితే (ఎప్పుడో లెండి) ఏమన్నారో తెలుసా  దీనివల్ల నాకు తెలిసింది ఒక్కటే పిల్లలని బయటకు విసిరేసి భార్యచుట్టు తిరగాలి అని... నిజంగా ఆ జవాబు నేను ఉహించలేదు. కథలో తప్పుందా నేను చెప్పడంలో తప్పుందా అనుకున్న మళ్లీ ఈ కథ ఎవరికీ చెప్పాకూడదనుకున్న అయినా అలవాటు మానుకోలేక మరోసారి ఇంకొకరికి చెప్పా, కథ విని మనసు చదవడం అందరికి రాదండి మాటల్లో చెప్పాలి అది ఎపుడు అనుకున్నది అపుడే అన్నాడు... అంతే మళ్లీ ఇదిగో కథ మంచిదే ఎవరి ఆలోచనని బట్టి వాళ్ళు అర్ధం చేసుకుంటారు అని నమ్మి నేను వ్రాసిన కథ   మనసు మాట్లాడాలి  .....