అమ్మాయిలకు ఇంతకూ ముందు చదువుకునే వనరులు లేక మాత్రమే చదవలేదు.. ఇపుడు కావలసిన వనరులు, చదువుకు పెట్టుబడి పెట్టడానికి తల్లితండ్రులు వెనుకాడడం లేదు. అమ్మాయి చదువుకుంటే, ఆమెను చేసుకోడానికి అంతకంటే పై అంతస్థువాడు వస్తాడని, తమ స్థాయి కంటే రెండు స్థాయిల పైన ఉంటుందన్న ఆశ ఒక కారణం . అమ్మాయిలకు చదువు ప్రతి ఇంట్లో సెకండ్ ప్రేఫెరెన్సు, చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే, తన కంటే పై స్థాయి వాడిని వివాహం చేసుకునే అర్హత వస్తుందని, లేదంటే కాస్తా కట్నం ఎక్కువ ఇచ్చి అలాంటి వాడిని తల్లి తండ్రులు తెస్తారని ప్రతి అమ్మాయి అనుకోవడం వల్ల తను చదువుపై ఆందోళన చెందడంలేదు, తనకు బ్రతుకు భయం లేదు, తన బ్రెయిన్ ప్రశాంతంగా ఉంది, అందుకే తను కొద్ది సమయం చదువుకు పెట్టినా కూడా ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతుంది.
ఎందుకు ఆడపిల్లల్లో డబ్బు సంపాదనపై ఆశక్తి పెరిగింది, భర్త సంపాదన అందరిది, కాని భార్య సంపాదన ఆమె సొంతం, తను కొంతమేర ఇంట్లోకి వాడవచ్చు, మిగిలినది తన అభిరుచికి అనుగుణంగా వాడుకునే స్వతంత్రం ఉండడమే ముఖ్య కారణం. అందుకే ఈ తరం వాళ్ళకు పిల్లలను పెంచడంలో కన్నా తమ కెరీర్ అభివృద్ధికే ఎక్కువ సమయం పెట్టడానికి ఇష్టపడుతున్నారు. పిల్లలను వద్దనుకునేవారికి వివాహా బంధం కూడా ఆకర్షించదు కదా!
'స్త్రీ ఎపుడైతే వివాహ బంధం, మాతృత్వం అనేవి సంకెళ్ళుగా తలచి, ఆ బంధం నుండి వైతోలగి ఏ రంగంలో నైన నైపుణ్యం కనపర్చడం మొదలెడితే ఆమెను జయించడం ఎవరితరం కాదు' యిలా ఒకప్పుడు ఓషో చెపితే అందరు తప్పు పట్టారు. కాని ఇపుడు జరిగే పరిణామం చూస్తుంటే నిజమని ఒప్పుకోవాలేమో, ఇలానే కొన్ని సంవత్సరాలు కొనసాగితే, పిల్లలు కని ఇచ్చే స్త్రీకి అతి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే రోజుకూడా వస్తుందేమో.
2. పిల్లలను పిల్లలుగా చూస్తె తప్పు లేదు కాని ఇపుడు అమ్మాయికి చూపినంత శ్రద్ద మగపిల్లవాడిపై చూపకపోవడం గుర్తించాల్సిన విషయం, అమ్మాయికి ఏదైనా తెలియదు అంటే తెలుసుకొని చెప్పే తల్లితండ్రులు, అబ్బాయి విషయానికి వచ్చేసరికి ఆ మాత్రం నువ్వు తెలుసుకోలేవా అని అంటున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అందులో అబ్బాయి అమ్మాయికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడికి గురిచేస్తున్నారు. జీవితంలో ఉన్నతమైన ఉద్యోగం సంపాదించడాన్ని జీవిత గమ్యంగా నిర్దేసిస్తున్నారు, ఇలాంటి ఒత్తిడి అబ్బాయిలల్లో తెలియకుండానే, ఆత్మనూన్యతకు గురిచేయడమే కాకుండా తను అధికుడనని, బలవంతుడనని, కావలసింది అందుకునే మొండివాడిని అని నిరూపించుకోడానికి, నలుగురి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో కొందరు ఎంచుకున్నదే ప్రేమించడం, ప్రేమ అందలేదని దాడులు చేయడం...
పురుషుడు తన సంపాదనా విభాగంలో సేవకుడిగా ఉన్నా, ఇంట్లో మహారాజుగా సేవలు అందుకునేవాడు ఒకప్పుడు, ఇపుడు ఆ పరిస్థితులు తరిగిపోయాయి....అబ్బాయిలు అందుకున్న ఆశయం...వాళ్ళకు తగినంత గుర్తింపు ఇవ్వడం లేదు,అమ్మాయి అందుకుంటే అపురూపం, అబ్బాయి అందుకుంటే సాధారణంగా పరిగణించడం వల్ల అమ్మాయిని పోటిదారుగా, శత్రువుగా భావిస్తున్నాడు. నీవు ప్రతీది సాధించగలవు అని కాక, నీవు తప్పని సరిగా చేయాలి, సంపాదనపరుడు కాకపొతే జీవించే అర్హత లేనట్టుగా, ఒత్తిడికి గురిచేయడం అనేది పెద్దలు, సమాజం చేస్తున్న పొరపాటు.