15, సెప్టెంబర్ 2013, ఆదివారం

జీవితపు పంటకు... సమస్యల సహకారమా.....???

ఉత్కంఠ భరితమైన వార్తలంటేనే అందరికీ ఆసక్తి. 'ఎవరో ఇద్దరు ప్రేమగా కాపురం చేస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు' అన్న వార్త చప్పగా ఉంటుంది. కానీ మన జీవితం మటుకు ఏ ప్రతిఘటన లేకుండా, ఒడిదుడుకులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.


ఒకసారి రైతు దేవునితో పోట్లాట వేసుకున్నాడు. "నీకు వ్యవసాయం గురించి ఏమి తెలుసు? నీవనుకున్నప్పుడే వర్షాలు కురిపిస్తున్నావు. నీ వల్ల చాలా ఇవ్వండిగా ఉంది. నా మాట విని ఈ పనులన్నీ ఒక రైతుకు ఇచ్చెయ్" అన్నాడు.

దేవుడు, "ఎండా, వాన, గాలి అంతా నీ వశంలో ఉండుగాక" అని వరమిచ్చేసి వెళ్ళిపోయాడు.

పంటల కాలం వచ్చింది.
"ఓ వాన, కురువు!" అన్నాడు. వాన పడింది! ఆగమంటే ఆగింది! నేలను దున్నాడు. కావలసిన వేగంతో గాలిని రమ్మన్నాడు. విత్తనాలు జల్లాడు. గాలి, వాన, ఎండా అన్నీ ఆటను చెప్పినట్లు విన్నాయి. చేలు పచ్చగా ఎదిగాయి.
కోతల కాలం వచ్చింది. రైతు ఒక వరికంకిని కోశాడు. తీసి చూసి నివ్వెరపోయాడు! లోపల ధాన్యం లేదు. వెంటనే మరో కంకిని కోసి చూశాడు. దానిలో కూడా ఏమి లేదు.

"ఓ భగవంతుడా గాలి,వాన, ఎండ అన్నింటినీ సమంగానే వాడాను అయినా కానీ పంట ఎందుకు దెబ్బతిన్నది!" అంటూ కోపంగా దేవునిపై అరిచాడు.

దేవుడు "నా దగ్గరున్నప్పుడు గాలి వేగంగా వీచేది, అప్పుడు పైరు అమ్మను గట్టిగా వాటేసుకునే పసిపిల్లలా భూమిలో తమ వేర్లను చాలా లోతుల్లోకి తీసుకెళ్ళేవి. అలాగే వాన తగ్గిందంటే, నీటిని వెతుక్కుంటూ వేర్లను నాలుగు దిక్కులకూ పంపించేవి. పోరాట పటిమ ఉంటేనే మొక్కలు  తమను తాము కాపాడుకునేందుకు బలంగా పెరుగుతాయి. అన్నింటికీ వసతులు కల్పించి ఇవ్వగానే నీ పంటకు సోమరితనం వచ్చేసింది. ఏపుగా ఎదిగిందే గాని, ధాన్యం ఇవ్వడం దానిచేత కాలేదు" అన్నాడు.

"వద్దు స్వామీ! ఇలాగైతే నీ వాన, గాలి నువ్వే ఉంచుకో" అని ఆ రైతు వాటిని దేవునికి అప్పగించేశాడు.
జీవితంలో అన్నీ సులభంగా సమకూరితే, ఆ జీవితం ఇలాగే ఉంటుంది. దానికి మించిన శూన్యం వేరొకటి ఉండదు. ఊహించని అనుభవాలు ఎదురొస్తే, జీవితంలో అనుభవించి తెలుసుకునే అవకాశాలుగా వాటిని భావించాలి. చిక్కులు వచ్చినప్పుడే మన సామర్ద్యం ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాం అన్నది స్పష్టంగా తెలుస్తుంది.

చీకటి సమస్య ఉన్నదుకే కదా విద్యుద్దీపాలు కనుగొన్నారు. సమస్యలే లేకుంటే మన మెదడు పనితీరు ఏ విధంగా ఉందొ ఎలా తెలుసుకోగలము? వాస్తవానికి మన పధ్ధతి సరిగా లేనపుడు. సాధారణ పరిస్థితులు కూడా సమస్యలుగా కనిపిస్తాయి.

ఎవరు అడిగినా అడగకపోయినా, ఈ ప్రపంచం మనపై సమస్యలను విసిరి, తమాషా చూడాలనుకుంటది. మరి వాటిని ఎదుర్కోడానికి సిద్దంగా ఉండడానికి భయం ఎందుకు..... (-జగ్గీ వాసుదేవ్, సాక్షి )

9, సెప్టెంబర్ 2013, సోమవారం

జీవితం ....స్వేచ్చా విహంగం


జీవితం చాలా వడివడిగా  పరుగులు తీస్తుంది.. నీవు ఆనందంగా ఉన్నావా, నిస్పృహతో నిట్టూరుస్తున్నావా అన్న దానితో పనిలేదు.... జీవితానికి సెలయేరులా పరిగెడుతూ, చూసేవారిని ఆకట్టుకుంటూ, అసూయతో రగిలేవారిని తన పరుగుతో ఓడిస్తూ, తనను ఆదరించేవారిని తన ఒరవడి సవ్వడితో ముగ్ధుల్ని చేస్తూ, స్వచ్ఛమైన నిజాయితీ గల ఒరవడి ఉన్న తనని ఆకట్టుకునే మనసున్న మనుషులకోసం నిశితంగా అన్వేషిస్తూ అలసట ఎరుగని జీవితం సాగుతూనే ఉంది.

ఎవరో ఒకరు తన(జీవితం) ఎదుట నించొని ఎక్కడికి పరిగెడుతావు...నీవు ఓదిగిపోవాల్సింది ఈ మనుషుల అరచేతిలోనే అంటూ ప్రశ్నిస్తే....ఓయీ...... నేను నిన్ను ప్రేమతో ఆదరించి ... ముగ్దమనోహర కౌగిలిలో చోటిచ్చాను... అయినా నీవు నన్ను ప్రేమించకపోగా ..నా స్వేచ్చను హరించే ప్రయత్నంలోనే ప్రతీ క్షణం పోరాటానికి సిద్దమవుతుంటే... ప్రేమ లేనిచోట ఈ జీవితానికి మాత్రం చోటేది...

నిజమే కదా... డబ్బుని ప్రేమిస్తాం, పనిని ప్రేమిస్తాం , మన శత్రువుని కూడా ప్రేమిస్తాం ద్వేషంతోనైనా ...కాని తనపై తనకు మాత్రం ఇష్టం, ప్రేమ, ఆదరణ, ఆత్మగౌరం మాత్రం సూన్యం ఐనపుడు... మనిషి తనని తను ప్రేమించలేడు... తమపై ఇష్టం లేనివారికి .... ప్రేమ అనే పదానికి అర్ధం ఎలా తెలుస్తుంది... తనపై ప్రేమ లేనివానికి.. జీవితం పై ఆరాధన ఎలా ఉంటుంది.. అటువంటి చోట  అరచేతిలో జీవితం ఎలా జీవిస్తుంది....