2, ఆగస్టు 2018, గురువారం

guess who .. వెతికి పట్టుకోండి..



దేవుడిని నమ్మినా,నమ్మపోయినా.. మనము కోరిన కోరికలు అన్నీ తీర్చినా, తీర్చకపోయినా  అతనిముందు నిల్చున్నపుడు మనసు ప్రశాంతత, ఆలోచనలు కళ్ళెం మనకు తెలియకుండానే పడుతుంది...ఇలా మరెక్కడైనా జరుగుతుందా! దీనికి జవాబు కూడా ప్రతిఒక్కరికి తెలిసినా, ఒప్పుకోడానికి అహం అడ్డువచ్చేవాళ్లు కోకొల్లలు.

ఏ మనిషి మరొకరికి వందశాతం తెలిసి ఉండకపోవచ్చు. కానీ నీ ఆలోచనలకు పగ్గం వేసి సరైన దారిలోకి మళ్ళేలా మాట్లాడేవాళ్లు, నీ ఆగ్రహాలు, అసూయ, అలజడి వెల్లుబికిన పరిస్థితిలో నీ ఆహాన్ని జోకొట్టి నీ వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపెట్టేవారు, నీవు మరచిన నీలోని మంచితనాన్ని జ్ణాపకాలుగా మార్చి నీ కందించేవారు. నీలోని నిన్ను నీకు పరిచయం చేసేవారు. ప్రతీవారికి ఉంటారు.

Guess who .. అది ఎవరైనా కావొచ్చు, స్నేహితుడో,అక్కనో చెల్లినో,అన్ననో తమ్ముడో, అమ్మనో నాన్ననో, తాతనో మామనో, బంధువో.. ప్రతిఒక్కరికి వీరిలో ఎవరో ఒకరు కావొచ్చు..

“నా కేవరూ లేరండి “ అని మీరంటే.. అది నిజం కాదు. మీ బిజీ లైఫ్ లో ఎక్కడో జారవిడిచి వుంటారు, అచ్చంగా తిరుపతికి వెళ్దాం అంటే తీరికే లేదండీ అని గత 15 సంవత్సరాలుగా పదే పదే చెపుతున్న వ్యక్తిలాగా ..

ఎక్కడో సంకెళ్ళు పడి ఉంటాయి అసూయ ఆగ్రహాల వల్లనో కలిమిలేముల వల్లనో, అనుకోని వేరే ఏదైనా కారణంగా కావచ్చు.... వెతికి పట్టుకోండి మీ మనన్సు సేదతీరే పట్టుకొమ్మని.. ఇందులో మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేది ఏమి లేదు.   

22, జనవరి 2018, సోమవారం

తెలియని కొత్త పుస్తకం

మన పిల్లలకి మనమే మొదటి ఆప్తులం కావడానికి మనం ఏమి చేయాలో ఎవరికీ వారు నిర్ణయించుకోవలసిన విషయం.

మాటలంటే మనసులో జరిగే విందులో నుండి
జారి పడే మిగుళు మాత్రమే - ఖలీల్ జీబ్రాన్
 

ఈ సూక్తి ఎంత బాగుందో... ఎవరికైనా మనం చెప్పే మాటలు మనసులోనే మథనం తర్వాత దాని నుండి కొన్ని భావాలు తీసేసి.. అవతలి వారిని ఆకట్టుకునే విధంగా మరి కొన్ని మార్చి అందమైన ప్రతిని అందిస్తాము కదా అని అనిపిస్తుంది.

ఒక సంఘటన జరిగినపుడు ఎన్నో ఆలోచనలను, ఉద్రేకాలు కలుగుతాయి కాని మాటల రూపానికి వచ్చేసరికి ఫలానా సంఘటన వలన నాకు చాలా బాధ కల్గింది అనే వాక్యంతో ముగిస్తాము....ఎవరైనా మనకు ఒక వాక్యాన్ని చెబితే అందులోని అంతః మథనాన్ని అందుకోగలిగితే మనం వారికి మొదటి అప్తులం అవుతాము.

children are always unknown author's new book... అని నేను నమ్ముతాను ... అలాంటి పుస్తకాన్ని తెలుసుకోవడం, దాన్ని అందుకోవడం, పరిశీలించడం .. మనకు ఇష్టమైన పుస్తకంగా పరిగణించడం.. ఆ పుస్తకాన్ని సమాజానికి పరిచయడం చేయడం అంటే తల్లిదండ్రులకు ఎంత మమకారం, బాధ్యత ఉండాలి

7, డిసెంబర్ 2017, గురువారం

సలాం సాబ్ (చిన్న కథ)

సింహం కీకారణ్యం లోకి వేట కెళ్లడం చూసి.. నక్క చుట్టూ కనిపించిన కుక్కల్ని. కుందేళ్ళని చేరదీసి నక్క తన తెలివితేటలు ప్రదర్శించి..

ఇప్పటి నుండి నేనే మృగరాజుని మీరందరు ' సలాం సాబ్' అనాలి నన్ను అని చెప్పింది..

4 రోజులయ్యాక అన్నిటికి  నక్క  పెద్దరికం చేస్తూ ఉండగ.... అల్లంత దూరాన సింహం కనిపించింది...
అంతే నక్క గబాల్న ' సలాం సాబ్' అంది...........  అది చూసి మిగతావి కూడా 'సలాం సాబ్' అన్నాయట. 


సింహం ఆగి 'ఏంటి మీకు నక్క కొత్త విద్య నేర్పిందా?' అని...చిన్న నవ్వుతో వాటి వైపు తిరిగి ' సలాం సాబ్' అంటుండగానే... అన్ని భయంతో  ముందు నక్క.....వెనక మిగతావి పడుతూ లేస్తూ " నక్కని చూసి వాత పెట్టుకోవడం అంటే ఇదే" అనుకుంటూ అడవిలోకి పరుగులెట్టాయ్..

ఎన్ని విద్యలు నేర్చినా ఇవి ఎప్పటికి పిరికివే....అంటూ ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది మృగరాజు

26, జులై 2017, బుధవారం

పంచవన్నెల జలతారు

కడలి లోని అలలా నేను ...... 
వినీలాకాశంలో కదిలే మబ్బులా నువ్వు.... 
అల్లనల్లన జీవిత గమనంలో 
మంచు బొమ్మలవలె కరుగుతున్న వేళ.. 
మనఅనుబంధం స్వేచ్చ కోరి 
రెక్కలు విప్పి ఎగిరిపోయిందేమోనని... 

ఓ సందేహం పురి విప్పకముందే.....

నింగిని నేలను తాకుతూ వామనుడిలా......
జలతారు అనుబంధానికి 
పంచవన్నెల పట్టు దారం చుడుతూ .....
......ఓ చిన్ని జ్ఞాపకం ....

6, ఏప్రిల్ 2015, సోమవారం

జ్ఞాపకాల ఆనవాలు....



నీకోసం వేచియున్నా అని మరచి,  
నది ఒడ్డున గులకరాళ్ళు ఏరుకుంటున్నా 
వెనుదిరిగి చూసేసరికి ...... ...........
నువ్వు వదిలి వెళ్ళిన అడుగుజాడలే
కనిపించాయి అల్లంత దూరంలో...... ........







29, నవంబర్ 2014, శనివారం

మరవలేని...మరపురాని మూడు కథలు

మరవలేని కథలు.. మరపురాని మూడు కథలు ఒక కరువు. మూడు ప్రాంతాలు. ముగ్గురు రచయితలు. ఒకే స్పందన గా ఊపిరి పోసుకున్న కథలు. జీవితంలో ఒక భాగం మన మనసుని తడిపేస్తుంది. మనల్ని నిలువెల్లా కదిలిస్తుంది, అందులోనుండి జాలువారే పదాలతో అల్లుకునే కథ కథకాదు.. మదిలోని భావా సంచలనాల ఆత్మఘోష
మలయాళ కథ దాని పేరు పోతిచోరు’. అంటే అన్నం పొట్లంఅని అర్థం. 1950నాటి కరువుని ఒక బడిపంతులి కోణం నుంచి రాసిన ఈ కథ కేరళను ఊపేసింది. ఈ కథను రాసింది కరూర్ నీలకంఠ పిళ్లై. కేరళలో రచయితల సహకార సమాఖ్యకి ఊపిరిపోసిన వ్యవస్థాపకుడు. స్కూల్ టీచర్. గొప్ప రచయిత.

మంచి కరువు కాలం. అనేక కాలాలుగా  పిడికెడు మెతుకులు కూడా దొరకని కాలం. అలాంటి కాలంలో ఒక మధ్యాహ్నం ఒక స్కూల్లో ఒక పిల్లవాడి అన్నం పొట్లం మాయమయ్యింది. ఎవరు తిన్నట్టు? అన్నం పొట్లం అంటే సామాన్యమా? మెతుకు మెతుకూ బంగారమే. ఆ పిల్లవాడు ప్రధానోపాధ్యాయుడికి కంప్లయింట్ చేశాడు. విచారణ జరిగింది. ఎవరూ దొరక లేదు. ఆ దొంగనో ఈ దొంగనో అయితే పట్టుకోవచ్చుగాని అన్నం దొంగను ఎవరు పట్టుకుంటారు? ప్రధానోపాధ్యాయుడు ఏదో సర్దుబాటు చేశాడు. కాని మరునాటికి ఆయన టేబుల్ మీద ఒక లేఖ ఉంది. దానిని దొంగ రాశాడు. అన్నం పొట్లాన్ని దొంగిలించిన దొంగ. అయ్యా... మరేం చేయమంటారు. కడుపు నిండా తిని చాలా కాలం అయ్యింది. అసలు అన్నం తినే చాలా కాలం అయ్యింది. చేస్తున్న పని అన్నం పెట్టడం లేదు. జీతాలు సక్రమంగా అందడం లేదు. ఏం చేయమంటారు? కళ్లు తిరిగి, శోష వస్తుంటే ఎంత ఏడుపూ గుప్పెడు మెతుకులకు సమానం కాదు కదా అని గతిలేక  దొంగతనం చేశాను. దీనికి నేను పైలోకాల్లో సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికి స్థిమితం కోసం మీతో చెప్పుకుంటున్నాను.... హెడ్మాస్టర్ కింద పేరు కోసం చూశాడు. ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. అక్కడ ఇలా ఉంది: ఇట్లు, మీ రెండో తరగతి ఉపాధ్యాయుడు! ఈ కథను రాసింది కరూర్ నీలకంఠ పిళ్లై. కేరళలో రచయితల సహకార సమాఖ్యకి ఊపిరిపోసిన వ్యవస్థాపకుడు. స్కూల్ టీచర్. గొప్ప రచయిత.

తమిళ కథ -ఎస్తర్’. ప్రసిద్ధ తమిళ రచయిత వణ్ణ నిలవన్ రాసిన కథ ఇది. కరువు విశ్వరూపాన్ని చూపిన కథ.
ఆ పల్లెలో అదొక పెద్ద ఇల్లు. ఆ ఇంటిలో చాలామంది. అప్పటికి చాలా రోజులుగా కరువు. ఎండకు అంతులేదు. రాత్రి చల్లదనం ఎరగదు. గొడ్డూ గోదా ఇళ్ల దగ్గర గడ్డిపోచక్కూడా నోచుకోక అడవి దారి పట్టి అక్కడా ఏమీ దొరక్క గుడ్లు తేలేస్తున్నాయి. నీళ్లు లేవు. పసిపిల్లలు తినడానికి రాగి పిండి కూడా మిగలడం లేదు. ఈ కరువు ఇప్పుడల్లా పోదా? వేచి చూశారు. వేచి చూశారు. వేచి చూశారు. కదలదే. కడుపులు ఎండిపోతున్నాయి. మనుషులు ఎండిపోతున్నారు. ఇక లాభం లేదు. మధురైకు వెళ్లి కూలో నాలో చేసుకు బతకాల్సిందే. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. కాని ఇప్పుడు? తప్పదు. అయితే ఇంట్లో ఒక ముసలావిడ ఉంది. మంచాన పడి ఉంది. చావు కోసం ఎదురు చూస్తూ ఉంది. చావు రాదు. ఈ పాడుకాలంలో కరువుకాలంలో ఆమెను మోసుకొని ఎక్కడికని వెళ్లడం? ఆమెను వదిలి వెళ్లడానికే నిశ్చయమైంది. ఆమె కూతురు ఎస్తర్- కుటుంబ పెద్ద-  నలిగిపోతూ ఉంది. ఒకటి రెండు రోజుల్లో ప్రయాణం. ముసలామె మరణించింది. అమ్మయ్య. కరువు రోజుల్లో ఏవో అంత్యక్రియలు అయ్యాయంటే అయ్యాయనిపించారు. ఆ తర్వాత ఆ కుటుంబం వలసకు బయలుదేరింది. కాని... కాని.... ఎస్తర్‌కు ముసలామె గుర్తుకొస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె కళ్లు. పైకప్పును చూస్తున్న, తడిదేరినట్టున్న ఆ కళ్లు ఆమెను చాలాకాలం వెంటాడిస్తున్నట్టు అనిపించింది. చాలా రోజుల వరకూ వాటినామె మర్చిపోలేకపోయింది. కథ ముగిసింది. అంటే? ఒక నిమిషం మనకు వెలగదు. వెలిగాక ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎస్తర్ ఆ ముసలామెను చంపేసింది. ఆ ముసలామె తన కన్నకూతురి వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండగా కొనఊపిరితో ఉన్న ఆమె ప్రాణాన్ని తీసేసింది! తప్పదు. కరువు. మనం మిగలాలి కదా.


తెలుగు కథ. సావు కూడు’. బండి నారాయణస్వామి రాసిన ఈ కథ కరువు ఉన్నంత కాలం ఉంటుంది. కరువు మాయమయ్యేంత వరకూ ఉంటుంది.
అసలే అనంతపురం. ఆపైన కరువుకాలం. ముసలాడు టపీమన్నాడు. అప్పటికే ఊళ్లో అందరికీ పంచెలు మాసిపోయి ఉన్నాయి. గడ్డాలు పెరిగిపోయి ఉన్నాయి. ఇళ్లల్లో ఆడాళ్లు నూరడానికి నాలుగు మిరపకాయలు కూడా లేక కారాలు మిరియాలు నూరుతున్నారు. కాని కర్మంతరం చేయక తప్పదు కదా. అక్కడకు తిరిగి ఇక్కడకు తిరిగి కుంటిదో గుడ్డిదో ముసలిదో ఏదో ఒక గొర్రెను పట్టుకొచ్చారు. కోశారు. ఏళ్ల తర్వాత ఒండినట్టుగా అదే మహాభాగ్యం అన్నట్టుగా మసాలా వేసి కూర వండారు. వేటకూర తిని ఎన్నాళ్లయ్యింది? కరువొచ్చినవాడికి తెలుస్తుంది ఆ భాగ్యం. అందరూ బిలబిలమని వచ్చారు. పీకల మొయ్యా తిన్నారు. తృప్తిగా ఆకువక్క నములుతున్నారు. కాని సరిగ్గా ఆ సమయంలోనే లోపలి నుంచి ముసలిదాని ఏడుపు మొదలయ్యింది. బొరోమని ఒకటే ఏడుపు. ముసలాడి మీద భ్రమ చావక ముసల్ది ఎంత ఏడుస్తుందమ్మా అని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఊరుకోబెట్టడానికి చూశారు. ఊరుకుంటేనా? ఇంకా ఏడవడమే. ఏమైందే ముసలిదానా... ఎందుకట్టా ఏడ్చి సస్తున్నావ్ నువ్వేడిస్తే పోయినోడు తిరిగొస్తాడా అని కొడుకు కొట్టడానికి వచ్చాడు. కాని ముసలాడి కోసమా ముసల్దాని ఏడుపు? కాదు. ముసల్ది ఏమందో తెలుసునా? మూడు నూర్లు పెట్టి గొర్రె తెస్తిరి. ఊరందరి కోసం కూర చేస్తిరి. ఎవరెవరికో పుట్టిన నా కొడుకులంతా గొంతు వరకూ తిని పాయిరి. నా ఇస్తరాకులో మాత్రం నాలుగు తునకలు కూడా ఎయ్యకపాతిరి... కూరంతా అయిపోయి బొమికలు మిగిలెను గదరా ముండనా కొడకల్లారా అని ఒకటే శోకం. ఎంత విషాదం ఇది. చావును అధిగమించిన ఆకలి విషాదం.  @సాక్షి వార్తా పత్రిక


1, సెప్టెంబర్ 2014, సోమవారం

బాపు గారి అద్బుతాలు ....





1945 "బాల" పత్రికలో బాపు (12) గారి మొదటి బొమ్మ .ఒకే బొమ్మలో ఎన్నో జంతువులు!!
(Surekha gari Collection.)




సత్తి రాజు లక్ష్మీనారాయణ (బాపు) గారి కుంచెలో ఎన్నో బొమ్మలు ప్రాణం పోసుకున్నాయి,
వారు డిగ్రీలో చేరిన కొత్తల్లో, అంటే 1952లో గీసిన ఈ చిత్తరువు అందుకు ఒక చక్కని ఉదాహరణ. షష్టి పూర్తి చేసుకున్న ఈ అంగన నేటికీ ఏనాటికి నిత్య యవ్వనే. ఈ చిత్రం గొప్పదనం ఏంటో తెలుసా? దీన్ని ఒకే గీతతో గీశారట ఆయన! కాస్త పరికించండి 





     ప్రేమ పై బాపు గారి గీత..... 






బ్రహ్మ కడిగిన పాదము....