27, మే 2012, ఆదివారం

చిన్న కథ.. మనసుకి చేరే మాట.....

మన మనసుకి తాకి మనలోని ఒక మార్పుకి, మన జీవితపు పరుగులకి ఒక అందం తెచ్చిన ఏ  చిన్న మాట/ఆలోచన  ఐనా మరొకరికి   పంచుకోడం మన బాద్యత.. ఎందుకంటే మనసుని తాకినా మాట పంచడం మొదలెడితే అది మరొక మదిని అందుకునే ప్రయత్నం తప్పక నెరవేరుతుంది ...

సమస్య ఎంత పెద్దది ఇతే అంత ఎక్కువ టెన్షన్ ఉంటుంది/ఉండాలి అనుకోడం పొరపాటు. సమస్యకి టెన్షన్ కి సంబంధం ఎలా ఉండాలంటే అంటూ ఒక డాక్టర్ (జూలూరి శ్రీనివాస్,అపోలో హాస్పిటల్) చెప్పిన కథ కాని కథ.....రేపు మంజీరాలో చుక్క నీరు ఉండదు అని తెలిసిందనుకోండి మీరు ఏమి చేస్తారు..మీ పంపులో నీరు రావడం లేదు అని తెలిసిందనుకోండి దానికి మీరు ఏమి చేస్తారు ..ఈ రెండిటిలో ఏది పెద్ద సమస్య, దేనికి మీరు టెన్షన్ పడొచ్చు అని అడిగారు..
రెండిటికి టెన్షన్ ఉంటుంది కదా అంటే....అందుకు ఆయన నవ్వి ఇలా చెప్పారు....
మీరు ఎంత టెన్షన్ పడినా మంజీరా లో నీటి సమస్యకి ఏమి చేయలేరు అందుకని అది మీకు ఒక వార్త లాంటిది మాత్రమె అందుకు మీరు టెన్షన్ పడకూడదు. మీ ఇంట్లో నీరు రావడం లేదన్నది చిన్న సమస్య ఐనా ..టెన్షన్ పడొచ్చు, ఎక్కడ పంపుకి అడ్డు పడిందో ఏమయ్యిందో అని ఎందుకంటే అది మీరు సరి చేసుకోవాల్సిన సమస్య అని..మనకు తెలియాల్సింది దేనికి టెన్షన్ పడొచ్చు , దేనికి పడకూడదు అని..చాలా మంది అనవసరమైన వాటికి అతి ఎక్కువ టెన్షన్ పడి అందర్ని ఇబ్బంది పెడతారు అని చెప్పారు.

ఒక చిన్న మాట , ఒక చిన్న సంఘటన జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తాయి ఒకోసారి...మనకు ఉన్నదానిలో నుండి పెట్టడం అన్నది  ఎంత ముఖ్యమో ఒక ముసలావిడ మాటల్లో తెలిసింది..... కూరగాయలు ఇంటింటికి తిరిగి అమ్మేది ....ఈ వయసులో ఇంత  కష్టపడుతున్నావు నిన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరా అని అడిగితే... ఇంకో సంవత్సరం ఆగితే ఇంటి దగ్గరే చిన్న కొట్టు పెట్టుకుంటా...అప్పటి వరకు ఇలా వస్తూ ఉంటాను అంది.... ఆవిడకు ఇద్దరు కొడుకులున్నారు... పెద్దవాడిని పది వరకు చదివించింది...నీవు దాచిన డబ్బులు ఇయ్యి వ్యాపారం చేస్తా అన్నాడట....నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అందుకోసం సంపాదించుకో అని చెప్పిందట...కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట...ఎక్కడో కంట్రాక్టర్ దగ్గర చేరాడు అక్కడే పెళ్లి చేసుకొని సంసారం ఏర్పరచుకున్నాడు....రెండో వాడు పది అయ్యాక  పై చదువులు చదువుతాను అన్నాడట....మాస్టారి ఇంట్లో ఉండు వాళ్ళ పిల్లలతో పాటు చదివిస్తాడు....వాళ్ళకి సాయంగా ఉండు అని చెప్పిందట.....నువ్వు ఎంత వరకు చదివిస్తావో చదివించు తరవాత నేను చూసుకుంటా అన్నాడట....ఇంత కంటే చేయలేను అని చెప్పిందట......ఎక్కడో హాస్టల్ లో పెద్ద చదువే చదువుతున్నాడట.. అపుడపుడు వస్తాడట  ఏమైనా ఖర్చులకు ఇమ్మని...ఉంటే వంద  లేదా రెండువందలో ఇస్తుందట ...... ఇపుడు తన దగ్గర 8 తరగతి చదివే పిల్లాడు ఉన్నాడట  వాడికి అమ్మా నాన్న లేరని తనే చదివిస్తుందట.....పది చదివాక వాడు ఏదైనా చేసుకుంటాడు అంది.....మరి నీకు తోడూ ఎవరూ వద్దా.. అని అడిగితే....చదివిస్తే పిల్లలకు కొదవా అని నవ్వింది.....

ఒక డాక్టర్ చెప్పిన మాటలు ఎంత నచ్చాయో.. ఒక సామాన్య స్త్రీ మాటలు అంతే  నచ్చాయి...నిజంగానే ఈ మాటలు మరవకుంటే జీవితం పరుగులో నిండుదనం చేకూరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు...