18, డిసెంబర్ 2012, మంగళవారం

నెమలీక

ఒకరు అడిగారని ప్రేమించరు....ఎవరో కోరారని ప్రేమించరు....ఒక్కోసారి ప్రేమించామని జీవితమంతా మనకే తెలియదు...ప్రేమించిన మనిషి మన కంటికెదురుగా ఉన్నంత  వరకు... ప్రేమ అనే పదం పలకడం సులువు...ఆస్వాదించడం నిరంతర  కృషి....మనసు స్వచ్చతకు ఒక ఆనవాలు...ఎవరు నిందించినా....ఎవరు నిరాకరించినా...ఎవరు బంధించినా.... చిట్టడవిలో కనుమరుగున ఉన్న గంధం చెట్టు సువాసనలా అందరిని అల్లుకుంటూనే  ఉంటుంది...ప్రేమ గెలిచినా..ఓడినా...పోరాడుతూనే ఉంటుంది తన మనుగడకోసం నిరంతరం...ఒకరి భాష్యానికి..ఒకరి భావానికి కట్టుబడిపోదు....అందుకే ప్రతీ ఒక్కరికి ఇంతటి  ఆరాధన ప్రేమంటే...నీకు లాగనే ....

జీవితం ఆకట్టుకోక పోయినా... ప్రేమ మాత్రం  అందరిని ఆకట్టుకుంటుంది .... ప్రేమించని మనిషి ఉండదు...కాకపొతే దేన్నీ ప్రేమించాడో తెలుసుకోలేకపోవచ్చు... కాని ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా...జీవితం పై పెద్దగా ఆశలు లేవు అంటూనే.. జీవితం అంటే నే విసుగు పుట్టిందని చాటింపు వేస్తూనే... ఈ జీవితమే వద్దంటూ తృణీకరిస్తూనే... ఎవరిపై చెప్పని చాడీలు చెపుతూనే...."నిజంగా నీకు నేను వద్దా అని జీవితం మన ఎదుట నిలబడి  ప్రశ్నించినపుడు...." అపుడు ఆలోచనలో పడతాడు... తనకు జీవితంపై ఎంతటి అనురాగమో... జీవితానికి ప్రేమించడమే తెలుసు...తనకు తెలిసింది మనకు అందించడమే తెలుసు.... ఎందుకంటే అది నీలాంటిదే కాబట్టి...

అందుకే జీవితంపై నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు...అది ఏది ఇచ్చినా నా దోసిట ఒడిసి పడతాను...అది ఇచ్చేది నా దోసిట పిడికెడు ఇసుకే కావొచ్చు, గులాబి మొగ్గే కావొచ్చు...తుమ్మముళ్ళే కానీ..గులక రాయే కానీ..రంగులనెమలీకలా నామనసంతా  జ్ఞాపకాలై నిండిపోతాయేమో....ఇది నేను నమ్మే నిజం ...
  మిమ్మల్ని నమ్మమని అడగలేను .... నమ్మొద్దని శాసించ లేను.

ఎదో ఒకసమయం.. నేను ఏమి ఆలోచించడం లేదనుకుంటూనే ఉన్నపుడు.. నా మనసు ఉల్లాసంగా పడవ ప్రయాణానికి వెళ్తుంది...అందుకు సాక్ష్యం తనతో తెచ్చే ఇసుకరేణువులు.. దోసిట ఉన్న ఇసుకతో ఈ తడి ఇసుకని కలిపి పిచ్చుక గూడు చేస్తాను..... అలసిన మనసు వడలిన ఆకుతో వస్తే గులాబీ మొగ్గని తోడుగా చేసి జీవం పోస్తా...
చెమ్మగిల్లిన మనసు తడితో  తుమ్మ ముల్లునే గులాబి ముళ్ళుగా మారుస్తా......ఏదైనాచేయగలను...జీవిత మిచ్చిన ఇన్ని బహుమతులు ఒదిగి ఒదిగి నా దోసిలి నిండుగా ఉన్నపుడు.... జీవితమిచ్చిన బహుమతులకు నేను రంగుల కాగితంతో అలంకరిస్తున్న ....నెమలీక లాంటి నువ్వు ఎదురైతే అందిద్దామని....  

19, నవంబర్ 2012, సోమవారం

మైదానం...చలం (చదవకూడదా )

చలం మైదానం వ్రాసి 85 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి "మైదానం" నేను ఇష్టపడే పుస్తకం అని పదిమందిలో చెప్పడానికి క్షణం తటపటాయించే వారు కోకొల్లలు....

ఒకరోజు అలా ఒకరింటికి వెళితే అక్కడ చలంగారి మైదానం కనిపించింది. ఏంటి మైదానం ఎవరు కొన్నారు అని అడిగాను ఆత్రుతగా.. అంతే అమ్మో అక్క ఏంటి ఆ నవల అలా ఉంది, ఎలా రాసాడో అంది. ఎందుకో నా మనసు నొచ్చుకుంది ఎక్కడో. 'అది ఇపుడు రాసింది కాదు. ఆ నవల 1927 లో వ్రాసారు' అని చెప్పాను తనకి. అవునా అని ఆశ్చర్యం ప్రకటించింది. ఆమె సంగతి ఏమొ కాని, నన్ను మాత్రం ఆ మైదానం అందుకోడం వెనుక ఉన్న జ్ఞాపకాలు చుట్టూముట్టాయి.    
 for more click here...   
అలనాటి స్మృతులు - "చల౦ మైదాన౦" (కష్టపడి ఇష్టపడ్డాను)

5, నవంబర్ 2012, సోమవారం

మదిలో.. అణువంత చోటులో...నీలి నీలి ఆకాశం

ఎంత ఎదిగినా, ఎలా ఉన్నా, ఆశల వెంట పరిగెత్తినా, ఆశయాల కోసం నిలబడినా, నువ్వయినా, నేనయినా ..మనకు మనం ఎంతో తెలిసినా ..మన మనసు పొరల్లో నీలి నీలి ఆకాశం లాంటి ఓ కల, చిన్ని కోరిక  ఒదిగి ఒదిగి ఉంటుంది.

ఎపుడో ఒకప్పుడు అలసట తీరక నిదురరాని రాత్రో.. ఆనందపు ఆశలు కెరటాల్లా నేరవేరుతూ,  అద్బుతమైన జీవితం అందుకుంటూ ఉన్నపుడో, ఎంత హాయిగా సాగిపోతుంది జీవితమంటూ ప్రశాంతంగా ఉన్నపుడో, జీవితంలో నాకంటూ ఏ కోరికా లేదంటూ వల్లె వేస్తున్నపుడో, నీ మనసు పొరల్లో అలజడి పగటికలలా ఎదుటనిలుస్తుంది...దానిపేరు ఒకరు జ్ఞాపకం అంటే, ఇంకొకరు ఆశ , వేరొకరు కోరిక పేరు ఏదైతేనేం.. మీరు దానికి మీ ఊహలు జోడిస్తూ ఆనందం పొందుతారు అన్నది నిజం..అది ఆవేదనా అంటూ కొందరన్నా..ఆవేదన పొందేవారికి మాత్రం అది స్వాంతన చేకూర్చేదే..

సమయం ఏదైనా కానీ, వయసు ఏదైనా కానీ..తళుక్కున పిచ్చక గూళ్ళు కట్టిన నేస్తం, చిన్న మాట పట్టిమ్పుతో దూరమైనా బంధాలు, అడగకనే చేయూత నిచ్చిన ఎందఱో స్నేహితులు, తెలిసినవాళ్ళు.. అందరూ మనవాళ్ళు, మన వీధీ, మన ఊరు ..కొందరితో పోట్లాడి, మరికొందరిని నాతో మాట్లాడకు అని నెట్టేసి, ఎలా ఉన్నా అందరూ అక్కడే అలానే ఉంటారాన్ని నమ్మకం..కాలంఒడిలో ఎక్కడెక్కడో జారిపోతారన్న ఆలోచన కూడా లేకుండా గడిపేసిన కాలం..........తప్పిపోతారని తెలిస్తే వాళ్ళ చిరునామా, ఫోన్ నెంబర్ తీసుకుని దాచుకునేవాళ్ళం అని ఇదిగో ఇలా ఇపుడు  "అది ఒకప్పటి జ్ఞాపకం అంటూ " అనుకుంటూ..గడిపేస్తున్నా..  అందులోని చిన్ని ఆశలకు, కోరికలు తటిల్లున కనుల ముందు నిలుస్తాయి....ఎదిగే  పిల్లలను చూస్తూ ఉన్నపుడు....

మన కళ్ళెదుట కనిపించే పిల్లలను చూస్తూ ఉంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటే..అయ్యో! ఈ కనిపించే జీవితం అందమైనది. అరచేతిలో దాచుకో అని చెప్పినా... ఎలా నమ్ముతారు, మళ్ళీ అవే పనులు కోపం వచ్చిందని మాట్లాడక, facebook లో unfreiend అంటూ ..మామూలే వాళ్ళలో నన్ను చూసుకుంటూ నేనిలా, ఎదిగే పిల్లలు ఇదే జీవితం అన్నీ ఇలానే ఉంటాయంటూ అలా...

ఏది ఏమైనా .....జీవితం అందమైనది... ఒడిసిపట్టుకున్న ఒదిగిపోదు, అరచి అల్లరి చేసినా మనల్ని వీడిపోదు..
మనతో మదిలో అణువంత చోటులో అనంతమైన ...ఆనందం.....

15, జూన్ 2012, శుక్రవారం

చిరునామా రాయని ఉత్తరం...

ఆకాశంలో మేఘాలు తన ఊహలన్ని నా ఒడిలో నింపిందేమొ .. వాటికి నా కలలనే రంగులు వేస్తె నీ చిరునవ్వు అయిందేమో...అందుకే నీ నవ్వుపై అంత మక్కువ. నిన్ను చూస్తె ఆకాశంలో ఇంద్రదనుస్సులా అనిపిస్తుంది..వర్షం వచ్చినపుడు వస్తుందా, వర్షం వస్తేనే కనిపిస్తుందా ఇంద్రధనస్సుఅంటే ఏమని సమాధానం చెపుతాం చెప్పు. అందులో నిజము అబద్దము రెండు ఉన్నాయేమో లేక అంతా అబద్దమేమో లేక ఇది అంతా ఒక కల్పన ఏమో ..ఎలా చెప్పగలం.

అలానే నువ్వు నాతోనే ఉన్నావా లేక నాలోనే ఉన్నావా ..కాదు నాలాగే ఉన్నావా .. అంటే చెప్పడం కష్టం.. నీవు వస్తే చిరుజల్లు కురిసినట్టు..నాతో ఉంటే జడివానాలో తడిసినట్టు .. ఆ తాకిడికి నేను నిలవలేనేమో అనే ఒక తలపు నన్ను ఎక్కడో మనసుపొరల్లో గుచ్చుతుంది.. వెళ్ళమనే నోటి మాటా, దాచుకోవాలన్న మనసు ఊహ,  నేను మేఘమై నిన్ను నాలో నింపుకొని, కొండకోనల్లోకి వెళ్ళాలనే ఆశ..

నా  దగ్గర  ఉన్నపుడు, దూరంగా వెళితే బాగుండనే కోరిక, దూరంగా ఉన్నపుడు ఒకసారి వస్తే బాగుండనే ఆశ, రమ్మని అడగాలి అని పెదవి అంచువరకు వస్తుంది ,కానీ మనసు ఆశపడిందని నాకోసం నేను చేయలేను కొన్ని, నీ చుట్టూ పొదలా ఉండాలనుకుంటా.. ఇంకో నీడ కూడా నీ మీద పడనంతగా, ఒకసారి విరజాజి తీగల తాకి తాగకుండా అల్లుకోవాలని కోరిక, మరోసారి అందరు మెచ్చని మర్రి చెట్టునై నీకు నీడనివ్వాలన్న పేరాశ, గులాబి మీద మంచుబిందువుగా ఉండిపోవాలని మదిలోని ఊహ.

నా అరచేతిలో ...మదిలో...ఆలోచనలో...ఊహలో..కలలో..కవితలో..నా నీడలో, అద్దంలో , కనిపించే చందమామలో, కనిపించని కలువలో నువ్వు ఉంటే....నువ్వే ఉంటే...నువ్వు మాత్రమే ఉంటే..... అంతే చెప్పడానికి మాటలు రావడం లేదు.... పదాలు అందడం లేదు....

4, జూన్ 2012, సోమవారం

ప్రాణమిచ్చిన ఏనుగులు

ఎన్నో కథలు చదువుతూ ఉంటారు, ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు..ఎపుడో ఒకప్పుడు ఇలా వినే ఉంటారు..నాకు ఎలాంటి సినిమా చూసినా, కథ చదివినా  ఏడుపు అనేదే రాదండి..అవన్ని నటన, అది కథ  అని తెలిసి ఎలా వస్తుందో అనడం.. ఇలా చెప్పేవాళ్ళు ఎంత నిజం చెప్పారో నాకు తెలియదు కానీ జీవితంలో కంట నీరు పెట్టని మనిషి అంటూ ఉండరు అన్నది మాత్రం అక్షరసత్యం.

కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎపుడో జరిగిపోయినవి అయినా వాటి తాలూకు జ్ఞాపకాన్ని వేరొకరితో పంచుకునేప్పుడు అపుడు పడిన బాధ తాలూకు నొప్పి..  నలుసంత అయినా తాకి నలిగిపోతుంది మనసు..అది చాలు మన కంటనీరు కదలడానికి.. అలానే యదార్ధగాధలు చదివినపుడు కొన్నిటికి స్పందనే కరువవుతుంది..మరి కొన్ని మనకే జరిగినట్టుగా అనిపించి తల్లడిల్లుతాము....

ఇలా చదువుతూ మరీ చేపుతారండి...నేను మాత్రం ఏడుపు అంటే ఏంటో మర్చిపోయానూ అని నవ్వేవాళ్ళు ఉండొచ్చు... అబ్బే అవన్ని మరీ మంచివాళ్ళు , పిరికివాళ్ళు చేసే పనులండి...నాలాంటి దుర్మార్గుడికి, కఠినాత్ముడిని ఏడిపించడం దేవుడి తరం కూడా కాదు అని ఒక్క మాటలో తెల్చిపడేసేవారు ఉండొచ్చు.

అసలు కథ చదివి ఎందుకు బాధపడతారు, మది భారమే కన్నీరుకి కారణం,మది ఎందుకు తల్లడిల్లుతుంది.... ప్రతీ మనిషి కి దయ జాలి అన్నది మనసు అరలో ఉంటుంది వాళ్ళు ఎంత కౄరులైనా... అందరి బాధలకు స్పందించకపోవచ్చు...అలా అని ఎవరి బాధకు స్పందించరు అనడం తగదు..కొన్ని కథలు అందరి మనసులని కదిలిస్తాయి..అందుకు మనిషి మనస్తత్వంతో పనిలేకుండా మనసుని తాకుతాయి.. కొన్ని కథలు, కొన్ని సంఘటనలు ఒకే మనిషి ఎన్ని సార్లు ఐనా ఏడిపించగలవు. ఎందుకంటే అవి మనసునే కాదు వారి అంతరంగాన్ని కూడా తడిముతుంది కాబట్టి..

అలాంటి ఒక కథనే మీకు పరిచయం చేస్తున్నాను ..ఎంతటి రాతి హృదయం అని చెప్పుకున్న కంట నీరు తాకకుండా, మనసు భారం కాకుండా కథ పూర్తి చేయలేరు...అలా చేసామని చెప్పినా నమ్మడం అసాధ్యం అని ఈ కథ చదివి మీరే అంటారు...
 
 ప్రాణమిచ్చిన ఏనుగులు

జపాన్ లోని యూనో జంతుశాలలో చెర్రీ చెట్లు చాలా ఉన్నాయి. ఈ కాలంలో చెర్రీ చెట్లు గులాబి రంగు పూలతో నిండుగా మనసును దోచుకుంటాయి. పూలరేకులు ఎండకు మెరుస్తున్నాయి. గాలి అలలకు పూలు జలజలా రాలుతున్నాయి. ఈ రోజు శెలవు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. జంతుశాలకు చాలా ఎక్కువ సంఖ్యలో చూసేవాళ్ళు వస్తున్నారు.

లోపల రెండు పెద్ద ఏనుగులు ఉన్నాయి. చూపరులకు కనువిందు చేసేలా అవి రకరకాల విన్యాసాలు చేస్తూన్నాయి. ఏనుగులు పెద్ద చెక్క దూలాల మీద పడిపోకుండా నిలబడి తొండంతో బూరలు ఊదుతున్నాయి.

ఇక్కడికి కొంచెం దూరంలో రాళ్ళతో ఒక సమాధి ఉంది. టోక్యోలోని యూనో జంతుశాలలో చపబడిన జంతువులకు గుర్తుగా ఆ సమాధి కట్టారు. జంతుశాలకు వచ్చే సందర్శకుల దృష్టి సాధారణంగా దీని మీద పడదు.ఒక రోజున నేను జంతుశాలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఈ రాతిస్మారక చిహ్నాన్ని ఎంతో ప్రేమతో తుడుస్తున్నాడు. అతడు చెప్పిన మూడు ఏనుగుల కథనే నేను మీకు మళ్ళీ చెబుతున్నాను.

ఈనాడు జంతుశాలకు వచ్చే వాళ్ళను వినోదపరచడానికి మూడు ఏనుగులు ఉన్నాయి.అయితే చాలా సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మూడు ఏనుగులు ఉండేవి. వాటి పేర్లు జాన్, టోకీ, వైన్లీ. అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నా రోజులు, జపాన్ కూడా ఈ యుద్దంలో పాల్గొంటుంది. జపానులో రోజూ ఎక్కడో ఒక చోట బాబులు పడేవి. ఒక్కొక్క రోజైతే బాంబులు వర్షం మాదిరి కురిసేవి.

ఏదైనా బాంబు జంతుశాల మీద పడితే ఏ ఆపద ముంచుకొస్తుందో ఏమో? జంతువుల బోను విరిగిపోవచ్చు. అప్పుడు ప్రమాదకర జంతువులూ తప్పించుకుని నగరంలో జోరబడవచ్చు. అప్పుడు అంటా భయం గుప్పిట బందీలవుతారు. ఈ ముప్పునుంచి తప్పించుకోటానికి అన్నీ ప్రమాదకర జంతువులను విషమిచ్చి చంపేయమని సైన్యం ఆదేశాలు ఇచ్చింది. సింహాలు, చిరుతపులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద పాములు - ఇలా ఒకటి తరువాత ఒకటి విషమిచ్చి చంపేశారు .

ఇక మూడు పెద్ద ఏనుగులు మిగిలాయి......for more click....ప్రాణమిచ్చిన ఏనుగులు

29, మే 2012, మంగళవారం

చిన్న కథ ..మల్లాది వెంకటకృష్ణమూర్తి

కోరిక....

"ఇది సింపుల్ గేమ్ . మన స్కూటర్ తాళం చేవులన్నీ ఓ డబ్బాలో పోసి బాగా కలుపుతాం. ప్రతి ఆటగాడు తన చేతికి వచ్చిన తాళం చెవిని తీసుకుంటాడు. ఎవరి స్కూటర్ తాళంచెవి వస్తే ఆ స్కూటర్ యజమాని భార్య ఆ రోజంతా అతనితో గడపాలి. ఇలా పన్నెండు మంది స్కూటరిస్ట్ ల భార్యలు, తమ భర్తతో కాక ఇంకొకరితో గడపాల్సి ఉంటుంది.... "వైఫ్ స్వాపింగ్ " అంటారు దీన్ని" పశుపతినాథ్ కి చెప్పాడు, అతని మిత్రుడు యతిరాజ్.

"నువ్వు ఇందులో పాల్గోన్నావా?" అడిగాడు కొత్తగా ఢిల్లీ బదిలీ అయి వచ్చిన పశుపతినాథ్.

"చాలా సార్లు తమాషాగా, ఎక్సైటింగ్ గా ఉంటుందా ఆట. ఎవరికీ ఎవరు దొరుకుతారో అన్న ఉత్కంఠ అనుభవించి తీరాలి.అయితే ఈ ఆటలో ముఖ్యమైన విషయం...వల్ల మద్య ఏం జరిగిందో ఇతరులకి చెప్పకూడదు. మరోసారి రహస్యంగా వాళ్లిద్దరూ కలుసుకోకూడదు.ఇట్సాల్  ఫర్ ఫన్! ఆలోచించండి.

ముందు ఆ విషయం గురించి మాట్లాడడానికే భయపడ్డాడు పశుపతినాథ్, కానీ లండన్ లో రెండేళ్లు చదివి వచ్చిన మిసెస్ పశుపతినాథ్ కి చెప్పాడు. ఆమె ఒప్పుకుంది. ఆ విషయం యతిరాజ్ కి ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా రాత్రి ఎడున్నరకి యిద్దరూ తమ స్కూటర్ మీద యతిరాజ్ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ముప్పై ఇదు లోపు వాళ్ళే, అందరి భార్యలు ఇంగ్లీషు మాట్లాడగలరు. అంతా మిసెస్ పశుపతినాథ్ భార్య వంక ఆసక్తిగా చూసారు. అందరితో పాటు తన స్కూటర్ తాళం చెవిని కూడా ఓ డబ్బాలో వేసాడు పశుపతినాథ్, డబ్బా బాగా కలిపాక చెప్పాడు యతిరాజ్.

"మొదటిసారి కాబట్టి మొదటి అవకాశ౦ నీది"

పశుపతినాథ్ ఆ డబ్బాలో నుండీ ఒక తాళంచెవి తీసాడు......అది యతిరాజ్ దే.
ఒప్పందం ప్రకారం యతిరాజ్ భార్యని తీసుకొని పశుపతినాథ్ తన ఇంటికి బయలుదేరాడు.దారిలో అతని మనసు నిండా రకరకాల ఊహలు, కోరికలు, 'వాటిలో కొన్ని అయినా తీరితే' ఆ ఊహకే అతనికి పులకరింతగా ఉంది. తన భార్య దర్శన్ సింగ్ తో అతనింటికి వెళ్ళింది. అక్కడ ఏమవుతుందో అన్న ఆలోచన రాలేదు పశుపతినాథ్ కి.

ఇంటికి చేరుకున్నాక తలుపు తీసి లోపలికెళ్ళి చెప్పాడు మిసెస్ యతిరాజ్ తో గౌరవంగా....
"రండి"
ఆమె లోపలికి వచ్చి, అతనికి ఆనుకొని నిలబడి చిన్నగా నవ్వింది. ఆమె వంటి మీద రోజ్ వాసన వస్తుంది.
"మన ఒప్పందం ప్రకారం నేనేం అడిగినా మీరు చెయ్యాలి అవునా?" అడిగాడు పశుపతినాథ్ చొక్కా గుండీలు చక చకా విప్పుతూ.
మిసెస్ యతిరాజ్ కొద్దిగా సిగ్గుపడింది అతను చొక్కా విప్పడం చూసి.
"అవును తీరని మీ కోరికలు తీర్చడానికే వచ్చాను" చెప్పింది.
" అయితే ఈ చొక్కాకి లూస్ గా ఉన్న బటన్స్ కుట్టండి. మా ఇల్లు కూడా మీ ఇల్లంత నీట్ గా సర్దండి. నాకు ఇష్టమైన కంది పచ్చడి, బీన్స్ పాటోలి, వంకాయ కాల్చి పచ్చడి, ఇంకా గంటలో మా పిల్లలు వస్తారు, వాళ్ళతో హోమ్ వర్క్ చేయించండి. ఇంటికి బూజులు దులిపి, పిల్లలు క్రేయాన్స్ తో గోడల మీద గీసిన బొమ్మలు చెరిపేయండి. మీ ఇంట్లో లాగా ఇంటి వెనుక మా మొక్కలన్నిటికీ పాదులు చేయండి, మీ ఇంట్లో ఉన్నలాంటి ప్లాస్టిక్ వైరుతో అల్లిన పూలసజ్జ ఒకటి అల్లి పెట్టండి. ఇవన్ని అయ్యాక కూడా మీకు నిద్రరాకపోతే నాకు ఓ మిల్స్ అండ్ బూన్ నవల చదివి వినిపించండి. ఇవన్నీ నా భార్య ద్వారా చాలా కాలంగా తీరని కోరికలు" చెప్పాడు పశుపతినాథ్ ఆనందంగా!



మల్లాది వెంకటకృష్ణమూర్తి 'కథాకేళి' 1991 లో మొదటి ప్రచురణ..మల్లాది గారి కథాకేళి అనే  కథ సంకలనంలో ప్రచుదించిన కథలన్నీ తొలుత వివిధ పత్రికల్లో వచ్చినవే.... ఈ కథాకేళి లో 80 కధలు ఉన్నాయి. ఈ కథలన్నీ కప్పు కాఫీ తాగేలోగా చదివేయగలం, ఈ కథలను చదివాక, మల్లాది వెంకటకృష్ణమూర్తి 'కథాకేళి' పుస్తకం లోని 600 మాటలు  మించని మిగతా కథలకోసం తప్పక ఆరాటపడతారని ఆశిస్తూ..for more click మల్లాది వెంకటకృష్ణమూర్తి ..కథాకేళి 1 
మల్లాది వెంకట కృష్ణమూర్తి...చిన్న కధలు..1

27, మే 2012, ఆదివారం

చిన్న కథ.. మనసుకి చేరే మాట.....

మన మనసుకి తాకి మనలోని ఒక మార్పుకి, మన జీవితపు పరుగులకి ఒక అందం తెచ్చిన ఏ  చిన్న మాట/ఆలోచన  ఐనా మరొకరికి   పంచుకోడం మన బాద్యత.. ఎందుకంటే మనసుని తాకినా మాట పంచడం మొదలెడితే అది మరొక మదిని అందుకునే ప్రయత్నం తప్పక నెరవేరుతుంది ...

సమస్య ఎంత పెద్దది ఇతే అంత ఎక్కువ టెన్షన్ ఉంటుంది/ఉండాలి అనుకోడం పొరపాటు. సమస్యకి టెన్షన్ కి సంబంధం ఎలా ఉండాలంటే అంటూ ఒక డాక్టర్ (జూలూరి శ్రీనివాస్,అపోలో హాస్పిటల్) చెప్పిన కథ కాని కథ.....రేపు మంజీరాలో చుక్క నీరు ఉండదు అని తెలిసిందనుకోండి మీరు ఏమి చేస్తారు..మీ పంపులో నీరు రావడం లేదు అని తెలిసిందనుకోండి దానికి మీరు ఏమి చేస్తారు ..ఈ రెండిటిలో ఏది పెద్ద సమస్య, దేనికి మీరు టెన్షన్ పడొచ్చు అని అడిగారు..
రెండిటికి టెన్షన్ ఉంటుంది కదా అంటే....అందుకు ఆయన నవ్వి ఇలా చెప్పారు....
మీరు ఎంత టెన్షన్ పడినా మంజీరా లో నీటి సమస్యకి ఏమి చేయలేరు అందుకని అది మీకు ఒక వార్త లాంటిది మాత్రమె అందుకు మీరు టెన్షన్ పడకూడదు. మీ ఇంట్లో నీరు రావడం లేదన్నది చిన్న సమస్య ఐనా ..టెన్షన్ పడొచ్చు, ఎక్కడ పంపుకి అడ్డు పడిందో ఏమయ్యిందో అని ఎందుకంటే అది మీరు సరి చేసుకోవాల్సిన సమస్య అని..మనకు తెలియాల్సింది దేనికి టెన్షన్ పడొచ్చు , దేనికి పడకూడదు అని..చాలా మంది అనవసరమైన వాటికి అతి ఎక్కువ టెన్షన్ పడి అందర్ని ఇబ్బంది పెడతారు అని చెప్పారు.

ఒక చిన్న మాట , ఒక చిన్న సంఘటన జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తాయి ఒకోసారి...మనకు ఉన్నదానిలో నుండి పెట్టడం అన్నది  ఎంత ముఖ్యమో ఒక ముసలావిడ మాటల్లో తెలిసింది..... కూరగాయలు ఇంటింటికి తిరిగి అమ్మేది ....ఈ వయసులో ఇంత  కష్టపడుతున్నావు నిన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరా అని అడిగితే... ఇంకో సంవత్సరం ఆగితే ఇంటి దగ్గరే చిన్న కొట్టు పెట్టుకుంటా...అప్పటి వరకు ఇలా వస్తూ ఉంటాను అంది.... ఆవిడకు ఇద్దరు కొడుకులున్నారు... పెద్దవాడిని పది వరకు చదివించింది...నీవు దాచిన డబ్బులు ఇయ్యి వ్యాపారం చేస్తా అన్నాడట....నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అందుకోసం సంపాదించుకో అని చెప్పిందట...కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట...ఎక్కడో కంట్రాక్టర్ దగ్గర చేరాడు అక్కడే పెళ్లి చేసుకొని సంసారం ఏర్పరచుకున్నాడు....రెండో వాడు పది అయ్యాక  పై చదువులు చదువుతాను అన్నాడట....మాస్టారి ఇంట్లో ఉండు వాళ్ళ పిల్లలతో పాటు చదివిస్తాడు....వాళ్ళకి సాయంగా ఉండు అని చెప్పిందట.....నువ్వు ఎంత వరకు చదివిస్తావో చదివించు తరవాత నేను చూసుకుంటా అన్నాడట....ఇంత కంటే చేయలేను అని చెప్పిందట......ఎక్కడో హాస్టల్ లో పెద్ద చదువే చదువుతున్నాడట.. అపుడపుడు వస్తాడట  ఏమైనా ఖర్చులకు ఇమ్మని...ఉంటే వంద  లేదా రెండువందలో ఇస్తుందట ...... ఇపుడు తన దగ్గర 8 తరగతి చదివే పిల్లాడు ఉన్నాడట  వాడికి అమ్మా నాన్న లేరని తనే చదివిస్తుందట.....పది చదివాక వాడు ఏదైనా చేసుకుంటాడు అంది.....మరి నీకు తోడూ ఎవరూ వద్దా.. అని అడిగితే....చదివిస్తే పిల్లలకు కొదవా అని నవ్వింది.....

ఒక డాక్టర్ చెప్పిన మాటలు ఎంత నచ్చాయో.. ఒక సామాన్య స్త్రీ మాటలు అంతే  నచ్చాయి...నిజంగానే ఈ మాటలు మరవకుంటే జీవితం పరుగులో నిండుదనం చేకూరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు...

1, మే 2012, మంగళవారం

కొత్త నేస్తం...

 ఇల్లు చూడగానే నచ్చలేదు...నేను ఇక్కడే ఉండాలి అనుకున్నాక మళ్ళీ మళ్ళీ ఆ ఇంటిని చూసా ..పాపం తన తప్పేం లేదు ఆ ఇంటి వాళ్ళ జ్ఞాపకాలతో వాళ్ళ ఆలోచనలతో అలసిపోయి ఉన్నట్టు అనిపించాక..అరచేయి చాచి స్నేహ హస్తం అందుకున్న ...ఇపుడు పాత జ్ఞాపకాలు అనుభవాలు అన్ని మరచి నాకై ముస్తాబైంది..

నేను తనకోసం ఎలా ఉండాలో .. దానికోసం ఏమి చేయాలో ఆలోచిస్తుంటే మనసంతా అలజడి..అందరూ అంటారు నువ్వు పాతవన్నీవదిలించుకుంటావు నీకు వస్తువులపైన ఏమి మమకారం ఉండదా అని.. ఏంటో వాళ్ళ ఆలోచన తప్పు అని అనలేను అలా అని అందరు చెప్పినట్టు నేను అన్ని దాచలేను....ప్రతీ దాని వెనుక ఎన్నో కలలుంటాయి ఎన్నో ఉహలుంటాయి, కొన్నిటి వెనుక కలతలుంటాయి అవి అన్ని నా జ్ఞాపకాలకి ఆనవాలు

నేను పాత చోటే నా జ్ఞాపకాల ఒడిలో ఉన్న ఎన్నోఆనవాలన్ని చేరిపెసా....వాటి తాలూకు ప్రతీ జ్ఞాపకాన్ని మనసు అడుగున సమాధి చేశా..కలతలని కన్నీళ్ళని నా వెంట రావొద్దని మొండితనంతో ఇనుప కంచే కట్టాను...నాకై తనని మార్చుకున్న ఇంటికోసం ... నేను మారలేక..నా కలతలతో తన అందం చెరిగిపోకుండా నాకై నేను కొన్ని అడ్డుగోడలు కట్టా...కొత్త నేస్తం కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా..ఇపుడు ఇద్దరం ఒకరికి ఒకరం....తన ఒడిలో నేను ...నా అరచేతి స్పర్శతో తను..

11, మార్చి 2012, ఆదివారం

పిచ్చి మనసు...

గుండె గొంతుతో కొట్లాడుతుంది....మాట అన్నది పలకనన్నది... ఊసులేవి చెప్పనన్నది, ఒంటరిగానే ఉంటానంటూ, తన వ్యధనేమో దాచిపెట్టి కంటి తడి బానిసను కానంటు మొండికేసి, మోకాళ్ళపై తలవంచి ఆలోచనలు కుప్పపోసి కోపంతో తగలెట్టి..విసురుగా సముద్రపుతీరం వైపు వడి వడిగా అడుగులేసి...అక్కడే కూర్చుండిపోయే..పిచ్చి మనసు ఓ చిన్ని మనసు.....మాటలేవీ వద్దే వద్దంటూ తెలిసిన అక్షరాలన్ని గులకరాళ్ళుగ చేసి సముద్రంలో విసిరేసింది..తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ పిచుకగూళ్ళు చేసి చెరిపేసింది....దాగని కన్నీళ్ళను నీటి చెలమలో కలిపేసింది....

అపుడు నీకు నేనున్నానంటూ భుజంపై చేయి వేసి ఒకరు, నీ ఇష్టం నాకు కాక ఎవరికీ తెలుస్తుంది అని తలపై చేయి వేసి ఒకరు,నీకు కావలసింది అందించే నేను ఉన్నానుగా అంటూ ఒకరు...ఇందరు ఉన్నా పలకడానికి ఒక అక్షరం కూడా లేదు  ఇపుడు....వారంతా నా వాళ్ళేకామోసు అని చెరిగిన పిచుకగూళ్ళ వైపు చూసింది. పకపకా నవ్వింది....పగలపడి నవ్వింది...ప్రశాంతంగా ఆగి ఆగి నవ్వింది...  నా వ్యధ పంచకుండానే, నాకై ఎవరి సాయం కోరకుండానే, నా ఇష్టం తెలిసి నాకు అందించలేదేమని అడగకుండానే....నాకోసం ఇపుడు వచ్చావా అనకుండానే... నాకై నీ అరచేతిని అడ్డుపెట్టలేదేమని ఆర్దిచకుండానే హాయిగా నవ్వడం వచ్చేసింది.....నేను గెలిచేసానోచ్ అని గెంతులువేసింది ఉల్లాసంగా పిచ్చి మనసు..తర్కం  తెలియని చిన్నపిల్లలా...

1, మార్చి 2012, గురువారం

మనసున మనసై బ్రతుకున బ్రతుకై...

మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.
ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారి సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి మరియు జగ్గయ్య లు నటించారు. ఈ సన్నివేశం నాగార్జున సాగర్ నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.

ఈ పాట 50వసంతాలకి చేరువలో ఉంది. విచిత్రం ఏంటంటే పాట పాత పడే కొద్ది అందులోని భావం మాత్రం ఎంతో శక్తి మంతమవుతూ ఉంది. ఈ పాట విన్నాక ఇలాంటి మనిషి మనకు ఉంటే అంతకన్నా ఏమి కావాలి ఈ జీవితానికి అని అనుకోని వారు ఉండరు.అప్పటికే ఆస్థులు,అంతస్థులు,పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన వారు కూడా ఇలాంటి ఒక మనిషి కోసం అరాట  పడడం అతిశయోక్తి కాదు. నిజంగా అలా ఒక మనిషితో అన్ని పంచుకుంటూ జీవితం గడపడం సాద్యమా అనే కంటే అలాంటి మనిషి మనతో జీవిత మంతా ఉండే అవకాశం సాధ్యమా అని ఆలోచించాలి. అలాంటి బంధం ఏ ఇరువురి మధ్య ఐనా కావచ్చు ...మన బంధం సోదరి/సోదరుడు, అమ్మ/నాన్న,కూతురు/కొడుకు,స్నేహితులు వీరిలో ఎవరైనా కావొచ్చు మన మనసున మనసై....కాకపోతే గుర్తించడం కష్టం, గుర్తించినా జీవితమంతా నిలుపుకోవడం ఇంకా కష్టం ..నాకు తెలిసిన సత్యం ఇదే...నేను నమ్మిన  నిజం కూడా ఇదే...వీలైతే కాదు..వీలుచేసుకొని మీరు ఒకసారి ఈ పాట విని ...నిజమెంతో మీరే చెప్పండి...

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 1
ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
చరణం: 2
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

29, ఫిబ్రవరి 2012, బుధవారం

మనసు ఇచ్చే విరామం .......

ఆలోచనలు చేయలేని మనసు, ఆనందం వెతుక్కోవడం కోసం ప్రతీ క్షణం ఎదురుతెన్నులు చూసే మనసు...ఒక చిన్న మాటకే తుళ్ళింతలతో కృష్ణనదిలా పరుగులిడే మనసు....అందాల హరివిల్లుకు ధీటైన మనసు ఒక్కోసారి ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోతుంది....అపుడు ఎవరు మనల్ని పలకరించిన చెప్పే జవాబు ఒకటే మనసు బాగాలేదు ఈ పదం ఎపుడో ఒకప్పుడు అందరూ చెప్పేదే..

మనసుకు నచ్చని పని చేయడం తప్పని సరి అయినపుడు, మనసు ని బుజ్జగించడం మొదలెడతాం మన మెదడులోని ఆలోచనా శక్తితో, మనసు తనకు కావాల్సింది వదులుకోక తప్పదని తెలిసినపుడు తను కోల్పోయే ఆనందం భర్తీ ఎక్కడ ఎలా చేయాలి అని, తనని తాను కోల్పోకుండా ఉండడానికి ఇచ్చే చిన్న విరామమే....ఈ నిశ్శబ్దం

చిన్నపిల్లాడు తనవద్ద ఉన్నఎర్ర రంగు బంతి పోగొట్టుకొని వేరే రంగు బంతి తో  లేదా అమ్మ ఇచ్చే చాక్లెట్ తో భర్తీ చేసినపుడు మనసులోని నిశ్శబ్దం గుర్తించలేనంత తక్కువ నిడివి కలిగి ఉంటుంది , ఒక తల్లి తన పిల్లాడు తప్పు చేస్తే మన్నించి  అక్కున చేర్చుకోడానికి మధ్య మనసు యొక్క నిశ్శబ్దం నిడివి తక్కువ,  ..కానీ  అన్ని సమయాల్లో అది సాధ్యం కాదు . ఏది ఏమైనప్పటికి మనసులోని నిశ్శబ్దం నిడివి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఈ నిడివి పెరిగే కొద్ది మనం అందుకునే ఆనందం ఎంత ఎక్కువ ఉంటుందో తెలియదు కానీ మనతో ఉండే పరిసరాలలో మనుషుల్లో పెను మార్పు కలగడం మాత్రం ఖాయం.

కొన్ని ఆకారణ ద్వేష భావాల వల్ల నిశ్శబ్ద నిడివి ఊహించలేనంత ఎక్కువగా ఉంటుంది ,అపుడు   ఈ మనసులో నిశ్శబ్దం మనిషిని కృంగదీస్తుంది.ఆప్తులని దూరం చేస్తుంది. ఇలాంటివి మనిషి జీవితంలో ఎపుడో ఒకప్పుడు ఎదురై ఇబ్బంది పెట్టొచ్చు..కానీ ఇలాంటివి  జీవితం మొత్తంలో అతి తక్కువ భాగస్వామ్యం ఉంటుంది.

మార్పు తప్పనిసరి ఇనపుడు, పదే పదే జరగనివి తలచుకోకుండా వీలయినంత త్వరగా వాటినన్నిటిని ఒక జ్ఞాపకంగా మార్చుకో....గోదావరి నది లాంటి నిశ్శబ్దాన్ని జ్ఞాపకాల భరిణలో దాచి కృష్ణవేణి నదిలా తుళ్ళింతలతో  సాగిపో... అది నీవు జీవితానికి అందించి అపురూపమైన కానుక.....

11, జనవరి 2012, బుధవారం

అద్దాల భరిణె లోని జ్ఞాపకం....ఈ కాశ్మీర్ నీలం

మనతో పరిగెడుతున్న కాలం..కాలంతో పోటీ పడుతూ మనం....నేను ఆనందంగా ఉన్నాను కాదా నా కంట్లో తడి ఆరిపోయిందేమో అనుకునే క్షణం... సుదీర తీరం నుండి చిన్న వార్తా... చిన్న మాట అదేంటి పేరు కూడా మనసుకు తట్టడం లేదు కానీ ఎందుకు మదిలో ఆలోచనలేమీ నాకు అందడం లేదు..కంటినుండిధారగా కన్నీళ్లు తప్ప వేరే ఏమి కనిపించడం లేదు...ఐనా వెక్కి ఏడవడం లేదు...నేను పెనవేసుకున్న జ్ఞాపకాలు నాకు మాత్రమే పరిమితం అన్న విషయం క్షణకాలం కూడా మరపుకు రాకుండా ఎలా ఉంది...నిజంగా నాకు బాధగా ఉందో లేక నలుగురి మధ్య నా బాధ్యత మరవకుండా కన్నీళ్ళకు అడ్డుకట్ట వేస్తూ ఉన్నందుకు సంతోష పడుతున్నానో తెలియని సమయం ..ఆనందరేఖలకు తెరకట్టి ఆవేదన చీకటిలో అలసటగా వాలిపోవాలని..వీటి మధ్య మనుషులు కనుమరుగు కాగానే అలా రాలే కన్నీటి చుక్కలు చూసి మనసెరిగిన ప్రియ ప్రియబాంధవి ఇదేనేమో అని ఇన్నేళ్ళకు కన్నీరుపై ఒకింత ఇష్టం కలిగింది అనిపించింది.

నీలం మూడు సంవత్సరాల పరిచయం...ఎక్కడో కాశ్మీర్ లో పుట్టి పెరిగిన అమ్మాయి..తెలుగే తెలియని అమ్మాయి..ఇక్కడ ఒక చిన్న పరిచయం...తెలియకుండానే మనసుకు నచ్చిన అమ్మాయి. ఎన్ని ఆశలు.. ఎన్ని ఇష్టాలు..క్యాన్సర్ అని తెలిసిన క్షణం నాకు తగ్గిపోతుంది కదా...నాకు జుట్టు పొతే మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందేమో...అలా జరక్కుండా ఏమి ట్రీట్మెంట్ లేదా అని అడిగిన అమ్మాయి... తప్పని సరి అయ్యేవరకు ఇంట్లో ఎవరికీ తెలియ పర్చకుండానే treatment మొదలుపెడ్డింది ఏమి తెలియని ఈ హైదరాబాద్ లో 26 సంవత్సరాల నీలం.....ఒక సంవత్సరం పోరాడి గెలిచానోచ్ అంటూ....ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలతో వాళ్ళ ఊరు వెళ్ళింది..కొన్ని నెలలు తిరక్కుండానే కోరి చేసుకుంటాను అంటూ వరుడు ఎదురయ్యాడు...treetment చేసిన డాక్టర్ ఇపుడు వద్దు ఇంకో సంవత్సరం ఆగమన్నాడు. ఆశకి... ఆలోచనలకి స్నేహం కుదరలేదు....ఉహాలతో పెళ్లిచేసుకొని....ఇదిగో మా హనీమూన్ photoes అంటూ వచ్చింది...ఈ సారి బ్రెయిన్ కి cancer అన్నారు...treatment కుదరదు అన్నారు.. నిశ్శబ్దంగా 15 రోజులు సెలవుపెట్టి మళ్ళీ వస్తా నంటూ కాశ్మీర్ వెళ్ళింది...మొన్న శనివారంతో తనకి సెలవులతో పనేలేదంటూ సెలవు తీసుకుంది..ఇప్పుడు  ఎక్కడో భూదేవి వడిలో నిదురిస్తుంది..(ఇది నీలం మాట..చోటి చోటి చీజోంకో క్యూ పకడ్ కె రక్తే ...రిస్తోంకో పకడియే )..తన రూపు కనుమరుగు అయిపోతుంది కానీ నా తలపుల్లో ఎక్కడో దాగివుంటుంది...తన పేరు మనసు ఊహలో ఉండిపోతుంది....నా మాటల్లో ఒక కథగా మిగిలితుంది..నీలం ఇపుడు నా  అద్దాల భరిణెలోని జ్ఞాపకం.


2, జనవరి 2012, సోమవారం

మదిలోని అలలు..

ఎన్నో కథలు ఎపుడో చదువుతాము..కొన్ని నవ్విస్తాయి..కొన్ని కవ్విస్తాయి..మరికొన్ని మనల్ని ఏమారుస్తాయి..ఇంకొన్ని మనలనే మారుస్తాయి..అతికొన్ని మారమని మనలని శాసిస్తాయి..కానీ కొన్ని మనకు తెలియకుండానే కొన్ని కథలు మన జీవితమంతా మనతోనే పయనిస్తాయి అవి పది కావొచ్చు వంద కావొచ్చు అవి మనతో పయనిస్తున్నాయి అని మనము కూడా గుర్తించలేనంతగా మనసులో స్థానం సంపాదించుకుంటాయి..ఒకరిని చూసినపుడు ఇతను/ఈమె బాగా తెలుసు అని అనిపించడానికి మీ మదిలోని కథలోని పాత్రనే కారణం అని గుర్తించడం ఒకింత కష్టమే.. మనసుని తాకినా కథలు ఎన్నో...అందులో అతికొన్నిమదిలోని అలలు..సంక్షిప్తంగా ఇక్కడ ఇలా ....

1.ఉదయిస్తున్న సూరిడిని చూస్తే భయం.. వడలిన ఆ ముదుసలికి , మళ్లీ 'రేపు' అనేది వస్తే, బ్రతకటానికి నూకలు ఎలా అని, అందుకే రేపటికోసం ఆకలిని వాయిదా వేసింది ఈరోజు, అప్పటికి ఆ వాయిదా వేయడం మొదలై 4 రోజులయ్యింది, ఆఖరుకు ఆకలి విజయం సాధించిది, అందుకే చారెడు నూకల గంజి కోసం అడుగు ముందు కేసింది..రేపటి సూరీడు  తలపు కొచ్చి తూలీపడి మరి లేవనే లేదు... ఇది ఎక్కడో నేను చదివిన కవితలోని భావం..

2. అబ్బా ఇంట్లో వాక్యూం క్లీనర్లు వచ్చాకా నాకు బ్రతుకు కష్టమైపోయింది అని వాపోయిందట ఓ ఎలుక  తన సహచరితో, నేను ఉండే వీధిలోని చెత్త కుప్ప దగ్గరకు వచ్చెయ్..జీవితాంతం ఇబ్బందే ఉండదు అందట.. అదెలా సాధ్యం అంటూ ఆశ్చర్య పోయిదట ఎలుక ..ఇంట్లో మొదలైన అభివృద్ధి వీధిలోకి రాదులెమ్మని నవ్వింది ఆ ఎలుకగారి సహచరి..

3.ఒక కుటుంబం లో చిన్నపిల్లవాడైన కొడుక్కి ప్రాణాపాయం. డబ్బుల్లేవు.... తండ్రికి ఉన్న ఒకే ఒక దారి ఎప్పట్నుంచో అప్పు ఉన్న ఓ కుటుంబం వారిని కలిసి డబ్బు వసూలు చేయడం. సరే, వాళ్ళింటికి వెళితే అక్కడ ఆ ఇంట్లో ఒకరు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.…ఆ విషంయం తెలిసినా తన డబ్బులు తీసుకొనే వెళ్ళాలి అన్న ఆత్రుతతో తన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తాడు ...డబ్బులు ఇవ్వకపోతే కదిలే ప్రశక్తే లేనట్టు ఆ ఇంటి గుమ్మం వదలడు...అలాంటి సమయంలోనే రోగంతో ఉన్న  ఆ ఇంటి మనిషి చనిపోతాడు ... దానితో ఇతన్ని మనుషుల రక్తం పీల్చే పిశాచం అన్నంత హీనంగా చూస్తారు. ఇతను అందరితో మాటలు పడి..ఛీ కొట్టించుకొని కొంత డబ్బులు తీసుకొని  ఇల్లు చేరేసరికి కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

4.ఒక ఊరిలో ఒక కవి ఉన్నారట, అతనికి భార్యా ఇద్దరు పిల్లలు కూడా,ఆతను రచయితగా నిలదొక్కుకోలేక పోయాడు, భార్య ఎపుడూ అనేది ఎందుకండీ! ఇక్కడ ఉండడం మనసు ఏదో కాస్త  పొలం ఉంది చిన్న ఇల్లు ఉంది ఊరిలో అక్కడే ఉంటే మనకు గడిచిపోతుంది, ఈ వ్రాయడం ఆపేసి వ్యవసాయం చేసుకుందాం అని అనేది...ఆతను మాత్రం నాకు వ్రాయడం  వచ్చు నేను ఇలా తప్ప వేరేల బ్రతకలేను అనేవాడు. ఎంత ప్రయత్నించిన అతనికి తగిన గుర్తింపు రాలేదు...పూట గడవడం కష్టంగా మార సాగింది...చేసేదేమీ లేకా సరే నీవు చెప్పినాట్టే ఊరికి వెళ్ళి పోదాం అన్నాడు...భార్య పిల్లలు అంతా బండిలో ప్రయాణం అయ్యారు...ఆతను బండి ఎక్కేముందు తన కలం, పుస్తాకాలు వదిలేసాడు అక్కడే, నేను చేయాల్సిన పని చేయలేనపుడు ఇవి మాత్రం ఎందుకు అని, సరే నిశ్సబ్దంగా బండి ఎక్కాడు...బండి ఊరి పొలిమేర వచ్చింది ..ఇంకా ఈ ఊర్లో నేను రైతునే కదా అన్నాడు...ఇంకొంచెం సేపటికి ఇల్లు వచ్చింది.. అందరు దిగారు...ఆతను మాత్రం అలానే వాలి పోయాడు...
కవిగా మరణించాడు...రైతుగా మారకముందే....ఆతను మనసా వాచా నమ్మాడు తను కవిని మాత్రమే నని....అందుకే నేమో అతని తనువు మనసు ఆత్మ అన్ని కలసికట్టుగా ఉన్నాయ్...



5. ఎపుడో 20 సంవత్సరాల  కింద చదివిన కథ, నాకు కథ పేరు కానీ వ్రాసిన వారు కానీ గుర్తులేదు. మనసులోని మాట చెప్పకపోతే జరిగింది ఈ కథలో చదివాక మనసుని మాట్లాడనివ్వాలి అని అనుకున్నాను. ఈ కథ ఒకరికి చెపితే (ఎప్పుడో లెండి) ఏమన్నారో తెలుసా  దీనివల్ల నాకు తెలిసింది ఒక్కటే పిల్లలని బయటకు విసిరేసి భార్యచుట్టు తిరగాలి అని... నిజంగా ఆ జవాబు నేను ఉహించలేదు. కథలో తప్పుందా నేను చెప్పడంలో తప్పుందా అనుకున్న మళ్లీ ఈ కథ ఎవరికీ చెప్పాకూడదనుకున్న అయినా అలవాటు మానుకోలేక మరోసారి ఇంకొకరికి చెప్పా, కథ విని మనసు చదవడం అందరికి రాదండి మాటల్లో చెప్పాలి అది ఎపుడు అనుకున్నది అపుడే అన్నాడు... అంతే మళ్లీ ఇదిగో కథ మంచిదే ఎవరి ఆలోచనని బట్టి వాళ్ళు అర్ధం చేసుకుంటారు అని నమ్మి నేను వ్రాసిన కథ   మనసు మాట్లాడాలి  .....